India Inc: ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై కంపెనీల శ్రద్ధ

ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా రహస్యంగా కౌన్సిలింగ్, సపోర్ట్ ఇవ్వడం కోసం ఈఏపీ వంటి కార్యక్రమాలని అమలు చేస్తున్నాయి.

Update: 2024-10-21 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కీలక కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవడం దేశీయ కార్పొరేట్ రంగంలో కీలక చర్చకు దారి తీసింది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సు, ఉత్పాదకతపై ప్రభావాన్ని చూపే వారి మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆఫీసు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోగా, ఇటీవలి ఘటనలతో మరికొన్ని కంపెనీలు ఈ అంశంపై దృష్టి సారించాయి. ఉద్యోగులు ఇతర కంపెనీలకు వెళ్లకుండా, సంస్థ వృద్ధికి ఆటంకం కలగకుండా ఉండేందుకు తగిన వాతావరణం కల్పించాలని భావిస్తున్నాయి. దానికోసం మెంటల్ హెల్త్ డేస్, కౌన్సిలింగ్ సర్వీసెస్‌తో పాటు మేనేజర్లు తమ టీమ్‌కు సరైన సూచనలు చేసేవిధంగా శిక్షణ అందించడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా రహస్యంగా కౌన్సిలింగ్, సపోర్ట్ ఇవ్వడం కోసం ఎంప్లాయి అసిస్టెన్స్ ప్రోగ్రామ్(ఈఏపీ) వంటి కార్యక్రమాలని అమలు చేస్తున్నాయి. దీని ద్వారా ఉద్యోగులకు అవసరమైన సహాయాన్ని, వారితో పాటు కుటుంబసభ్యులకు కూడా సహకారం అందిస్తున్నాయి. 24 గంటల పాటు ఈఏపీ కౌన్సిలింగ్ సపోర్ట్ ఉద్యోగులకు లభిస్తుందని అబాట్ ఇండియా రీజినల్ హెచ్ఆర్ డైరెక్టర్ దీప్‌శిఖా ముఖర్జీ తెలిపారు.

ఎందుకంటే..

గత సంవత్సరం, మెంటల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కోషియంట్ ఎట్ వర్క్‌ప్లేస్ 2023 సర్వే, దేశంలోని కార్పొరేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ల గురించి అధ్యయనం చేసింది. దాదాపు 48 శాతం కార్పొరేట్ ఉద్యోగులు తాము మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. వారిలో 56 శాతం మహిళా ఉద్యోగులు మరింత ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా 35-45 ఏళ్ల వయస్సు గలవారు దాదాపు 50 శాతం మంది ఒత్తిడి వల్ల వారు ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నారని అధ్యయం పేర్కొంది. ఈ ఒత్తిడి అత్యధికంగా ఈ-కామర్స్‌ రంగంలో ఉనట్టు గుర్తించారు. ఈ రంగంలో 64 శాతం మంది ఉద్యోగులు సవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఇతర ప్రభావిత రంగాలలో ఎఫ్ఎంసీజీ (56 శాతం), ఆటోమొబైల్, హెల్త్‌కేర్ (55 శాతం), హాస్పిటాలిటీ (53 శాతం), బీపీఓ (47 శాతం), బ్యాంకింగ్ (41 శాతం), విద్య (39 శాతం), ఈట్ (38 శాతం) మంది ఆయా కంపెనీల్లో పని ఒత్తిడి ఉన్నట్టు ధృవీకరించారు. 

Tags:    

Similar News