ఫ్లిప్‌కార్ట్‌లో పాత ఏసీ ఇచ్చి కొత్తది తీసుకునే సరికొత్త ఆఫర్!
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో యూజ్‌డ్ ఎయిర్ కండీషనర్ల(ఏసీ)కు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.
బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో యూజ్‌డ్ ఎయిర్ కండీషనర్ల(ఏసీ)కు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఏసీని ఎక్కడ కొనుగోలు చేశారనే దానితో సంబంధం లేకుండా వినియోగదారులు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. కంపెనీ అందించే పిన్‌కోడ్‌లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
కంపెనీ భాగస్వాముల సహకారంతో దేశవ్యాప్తంగా డోర్‌స్టెప్ పిక్-అప్ సేవలందిస్తామని, పరిమిత కాలానికి ఉచిత అన్ఇన్‌స్టాలేషన్స్ సేవలు కూడా అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇప్పటికే ఈ సౌకర్యాలను టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ వంటి గృహోపకరణాలకు అందిస్తున్నామని, కొత్తగా ప్రారంభించిన ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం ద్వారా కస్టమర్లు పాత ఏసీలను తిరిగి ఇవ్వడం, మరింత సామర్థ్యం కలిగిన వాటికి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాన్ని ఇస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్, న్యూ బిజినెస్ హెడ్ ఆదర్శ్ మీనన్ అన్నారు.
ఈ ఏడాది వేసవికి దేశవ్యాప్తంగా చాలామంది ఏసీలను కొనడం లేదా అప్‌గ్రేడ్ కోసం చూస్తారని, కొన్నేళ్ల నుంచి ఏసీల ఎక్స్ఛేంజ్ మార్కెట్ స్తబ్దుగా ఉంది, దీన్ని నిర్వహించడంలో సవాళ్లు ఉన్నందున నెమ్మదిగా వృద్ధి చెందుతోందని ఆదర్శ్ మీనన్ అభిప్రాయపడ్డారు. ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన కార్యక్రమం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేస్తూనే, అన్ని రకాల ఏసీ సమస్యలకు పరిష్కారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.