ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం!

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ కోసం 8.15 శాతం వడ్డీ రేటును నోటిఫై చేసింది.

Update: 2023-07-24 10:25 GMT

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ కోసం 8.15 శాతం వడ్డీ రేటును నోటిఫై చేసింది. దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ సోమవారం అధికారిక ఉత్తర్వులను ఇచ్చింది. ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.15 శాతం వడ్డీ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ(సీబీటీ) నిర్ణయం తీసుకోగా, దాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ ఏడాది మార్చిలోనే సీబీటీ వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంది. ఇది అంతకుముందు 2021-22లో ఇచ్చిన 8.10 శాతం కంటే స్వల్పంగా ఎక్కువ.

కేంద్ర ఆమోదంతో ఈపీఎఫ్ఓ అధికారులు త్వరలో వడ్డీ మొత్తాలను 6 కోట్ల మంది ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చేయనుంది. గతేడాది మార్చిలో ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును నలభై ఏళ్లకు మించిన కనిష్ఠానికి తగ్గించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు 8.5 శాతం ఉన్న వడ్డీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతం ఇచ్చారు. గతంలో 1977-78 ఆర్థిక సంవత్సరానికి కనిష్టంగా 8 శాతం ఇవ్వగా, ఆ తర్వాత 2021-22లో ఇచ్చినదే అతి తక్కువ వడ్డీ. 2015-16లో అత్యధికంగా 8.8 శాతం వడ్డీ ఇవ్వగా, అప్పటినుంచి క్రమంగా తగ్గిస్తూ వచ్చారు.


Similar News