Dharma Productions: కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలో సగం వాటా కొనుగోలు చేసిన అదర్ పూనావాలా

సెరీన్ ప్రొడక్షన్స్ రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఈ వాటా కొనుగోలు చేయనున్నారని ఇరు సంస్థలు వెల్లడించాయి.

Update: 2024-10-21 17:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అదర్ పూనావాలా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాను అదర్ పూనావాలా కొనుగోలు చేశారు. అదర్ పూనావాలాకు చెందిన సెరీన్ ప్రొడక్షన్స్ రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఈ వాటా కొనుగోలు చేయనున్నారని ఇరు సంస్థలు వెల్లడించాయి. సంస్థలో మిగిలిన సగం వాటా కరణ్ జోహార్ కొనసాగించనున్నారు. అలాగే, సంస్థ నిర్వహణలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కరణ్ ఉంటారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అపూర్వ మెహతా కొనసాగనున్నారు. కరోనా మహమ్మారి తర్వాత దేశీయ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలో భాగస్వామ్యం కోసం వాటా విక్రయానికి కరణ్ సిద్ధపడ్డారు. తాజా పెట్టుబడులతో తమ నిర్మాణ సంస్థ మరిన్ని నాణ్యమైన కంటెంట్స్‌ను అందిస్తుందని, భవిష్యత్తులో సెరీన్, ధర్మా కలిసి పనిచేస్తాయని ధర్మా కంపెనీ తెలిపింది. ప్రఖ్యాత సంస్థలో స్నేహితుడితో భాగస్వామ్యం పొందడం సంతోషంగా ఉంది. ధర్మా ప్రొడక్షన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని అదర్ పూనావాలా వెల్లడించారు. 

Tags:    

Similar News