ట్విట్టర్ సీఈఓ గా Elon Musk రాజీనామా..? పోల్ తర్వాత షాకింగ్ డెసిషన్
ట్విట్టర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇటీతల తన సొంత ప్లాట్‌ఫాంలో తాను ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉండాలా? వద్దా? అనే విషయంపై పోల్ నిర్వహించారు. దీనికి స్పందనగా పోల్‌లో 57.5 శాతం మంది మస్క్ పదవి నుంచి వైదొలగాలని, 42.5 శాతం మంది ఆ పదవిలోనే ఉండాలని ఓటు వేశారు. దీంతో ఎలాన్ మస్క్.. "ఉద్యోగంలో చేరడానికి సరిపోయే మూర్ఖుడు దొరికిన వెంటనే సీఈఓ పదవికి రాజీనామా చేస్తాను! ఆ తర్వాత, నేను సాఫ్ట్‌వేర్ & సర్వర్‌ల బృందాలను చూసుకుంటాను" అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత ఎలాన్ మస్క్ తన నిర్ణయాలతో విమర్శల పాలు అవుతున్నారు. చాలా మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించారు. అదే విధంగా వర్క్ విషయంలో కమిట్‌మెంట్‌గా పనిచేస్తామని ఉద్యోగుల నుంచి హామీ పత్రం కూడా అడిగారు. సోషల్ మీడియా సంస్థను కవర్ చేసే కొంతమంది జర్నలిస్టులను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మస్క్ ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలతో సంస్థను ఇబ్బందుల్లో నెడుతున్నారు. ఈ తరుణంలో చాలా మంది ట్విట్టర్ బాధ్యతల నుంచి మస్క్ తప్పుకోవాలని భావిస్తున్నారు.