Trillionaire: 2027 నాటికి ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్.. తర్వాత అదానీయే
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సైతం 2033 నాటికి ఆ హోదాను పొందగలరని అభిప్రాయపడింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ అత్యంత ధనవంతుల్లో ఇప్పటివరకు అందరూ బిలియన్ డాలర్ల సంపదతో ఎదుగుతున్నవారే. అయితే, గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ త్వరలో ప్రపంచ తొలి ట్రిలియన్ డాలర్ల కుబేరుడిగా ఎదగనున్నారని ఓ నివేదిక తెలిపింది. 2027 నాటికి ఈ ఘనతను మస్క్ సాధిస్తారని, ఆ తర్వాత ఏడాది 2028లో భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ట్రిలియన్ డాలర్ల సంపదను సాధించవచ్చని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సైతం 2033 నాటికి ఆ హోదాను పొందగలరని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఎలన్ మస్క్ 237 బిలియన్ డాలర్లతో ప్రస్తుతం ప్రపంచ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ట్రిలియనీర్‌గా మారేందుకు ఎలన్ మస్క్ ఏడాదికి సగటున 110 శాతంతో సంపదను పెంచుకోవాలని నివేదిక స్పష్టం చేసింది. 100 బిలియన్ డాలర్ల కంటే తక్కువ సంపదతో ప్రపంచ ధన్వంతుల జాబితాలో 13వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడున్న 123 శాతం వార్షిక వృద్ధి రేటుతో సంపద పెరిగితే ట్రిలియనీర్‌గా ఎదగవచ్చు. ఇక, ముఖేశ్ అంబానీ 111 బిలియన్ డాలర్లతో ఆసియా సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్నారు.