Union Budget: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లు తగ్గే అవకాశం
అధిక జీవనవ్యయం కలిగిన నగరవాసులు, కొత్త పన్ను విధానంలో ఇంటి అద్దె మినహాయింపు ఎంచుకునే వారికి ఇది ఎక్కువ లాభించనుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను తగ్గించడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు, నెమ్మదించిన ఆర్థికవ్యవస్థలో వినియోగం పెంచేందుకు రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వారిపై ఆదాయపు పన్ను తగ్గించడాన్ని సమీక్షిస్తోందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఇదే గనక జరిగితే లక్షలాది మంది వరకు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం లభిస్తుంది. ప్రత్యేకించి అధిక జీవనవ్యయం కలిగిన నగరవాసులు, కొత్త పన్ను విధానంలో ఇంటి అద్దె మినహాయింపు ఎంచుకునే వారికి ఇది ఎక్కువ లాభించనుంది. ఇప్పటివరకైతే ఆదాపు పన్ను తగ్గింపునకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్‌కు ముందు తుది నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు మెయిల్ పంపగా, బదులు రాలేదని రాయిటర్స్ పేర్కొంది.
పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ, ఎక్కువ మంది ప్రజలు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటారని ఆశిస్తోంది. మధ్యతరగతి చేతిలో ఎక్కువ డబ్బు ఉండటం వల్ల ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు వీలవుతుంది. దేశీయంగా వృద్ధి నెమ్మదించడం, అధిక ఆహార ద్రవ్యోల్బణం సహా నిత్యావసర వస్తువులు, వాహనాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ద్వారా సవాళ్లను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా అధిక పన్నుల కారణంగా మధ్యతరగతితో పాటు రాజకీయంగా కూడా ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటున్న వేళ దీని పరిష్కారానికి ఆదాయపు పన్ను తగ్గింపు దోహదపడవచ్చని అభిప్రాయపడుతోంది.