Supreme Court: క్రెడిట్ కార్డ్ బకాయిలపై అధిక వడ్డీని వసూలు చేయవచ్చు: సుప్రీంకోర్టు
బకాయిలను సమర్థవంతంగా చెల్లించేలా వినియోగదారులు బాధ్యతగా ఉండాలని సూచించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత అత్యున్నత న్యాయస్థానం పదహారేళ్ల నాటి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ) తీర్పును రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎన్‌సీడీఆర్‌సీ క్రెడిట్ కార్డు బకాయిలపై 30 శాతం ఎక్కువ వడ్డీని వసూలు చేయడాన్ని దోపిడీగా భావిస్తూ, అటువంటి ఛార్జీలు అన్యాయమైన వాణిజ్య పద్దతి అని తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై అధిక వడ్డీని వసూలు చేయడం చట్టబద్దమైని, అలాగే.. బకాయిలను సమర్థవంతంగా చెల్లించేలా వినియోగదారులు బాధ్యతగా ఉండాలని సూచించింది. ఈ మేరకు 2008లో ఎన్‌సీడీఆర్‌సీ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, క్రెడిట్ కార్డు బకాయిలపై 30 శాతం కంటే ఎక్కువ వడ్డీ చేసేలా బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇది అన్యాయమైన వణిజ్య పద్దతి కాదని, ఆర్‌బీఐ పరిధిలో వడ్డీ రేట్లపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్‌సీడీఆర్‌సీ తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధమైన మద్దతు లేదని, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949, ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులకు వడ్డీ రేట్లను నిర్ణయించే అధికారం ఉందని పేర్కొంది. క్రెడిట్ కార్డు కస్టమర్లకు వడ్డీ రేట్లు, పెనాల్టీల గురించి వివరంగా తెలియజేయాలని తెలిపింది. గడువు ముగిసిన చెల్లింపులు ఉంటే, కస్టమర్లు ఎక్కువ వడ్డీ చెల్లించక తప్పదు. ఇది 30 శాతం కంటే ఎక్కువ ఉండొచ్చు. బ్యాంకులు చట్టపరంగా ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేసినప్పటికీ, క్రెడిట్ కార్డు ఉన్న కస్టమర్లు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది.