FICCI: ఎలక్ట్రిక్ వాహనాల అడాప్షన్‌లో ఢిల్లీ అగ్రస్థానం

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ 11.5 శాతం వృద్ధితో ఈవీ వాహనాల వినియోగాన్ని చూసింది.

Update: 2024-12-05 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కార్బన్ న్యూట్రాలిటీ, నికర సున్నా ఉద్గారాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం వాహన తయారీ కంపెనీలను కోరుతోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో దేశవ్యాప్తంగా రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉందని ఫిక్కీ-యెస్ బ్యాంక్ నివేదిక తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ 11.5 శాతం వృద్ధితో ఈవీ వాహనాల వినియోగాన్ని చూసింది. దీని తర్వాత కేరళలో ఈవీల అడాప్షన్ 11.1 శాతం, అస్సాంలో 10 శాతం, కర్ణాటకలో 9.9 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 9.2 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ఈవీ విభాగంలో అత్యధికంగా త్రీ-వీలర్ వాహానాలను కలిగి ఉంది. రాష్ట్రంలో మొత్తం ఈవీ అమ్మకాల్లో 80 శాతం త్రీ-వీలర్ ఈవీలే ఉన్నాయి. టూ-వీలర్ విభాగంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తం ఈవీ టూవీలర్ అమ్మకాల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటాయే 60 శాతం ఉంది. ఇందులో అధికంగా 13.5 శాతంతో కేరళ ముందంజలో ఉంది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ 89.5 శాతంతో ముందుంది. ఢిల్లీలో 82.8 శాతం, అస్సాం 82.5 శాతం, ఉత్తరప్రదేశ్ 82.4 శాతం, పంజాబ్ 81.8 శాతం వద్ద ఉన్నాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వినియోగంలో కేరళ 5.4 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, కర్ణాటక 3.7 శాతం, ఢిల్లీ 3 శాతం, ఛత్తీస్‌గఢ్ 2.9 శాతం, మహారాష్ట్ర 2.9 శాతం కలిగి ఉన్నాయి. 

Tags:    

Similar News