Swiggy: ఆహారం వృధాకు చెక్.. 'స్విగ్గీ సర్వ్స్' కార్యక్రమం ప్రారంభం
దీనికోసం కంపెనీ స్వచ్ఛంద సంస్థ రాబి హుడ్ ఆర్మీతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఆహార వ్యర్థాలను తగ్గించేందుకు గురువారం 'స్విగ్గీ సర్వ్స్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా స్విగ్గీ తన రెస్టారెంట్ పార్ట్‌నర్‌ల నుంచి మిగులు ఆహారాన్ని ఆకలితో ఉండేవారికి పునఃపంపిణీ చేయనున్నారు. దీనికోసం కంపెనీ స్వచ్ఛంద సంస్థ రాబి హుడ్ ఆర్మీతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా మాట్లాడిన స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్.. ప్రస్తుతం ఈ సేవలను 33 నగరాల్లో అందిస్తున్నామని, దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. స్విగ్గీ సర్వ్స్ ద్వారా ఆహారం వృధా అవకుండా తగ్గించడమే కాకుండా ఆకలితో ఇబ్బందిపడే వారికి అందించి, తద్వారా వృధా కాకుండా చూసుకోవాలన్నారు. రాబిన్ హుడ్ ఆర్మీతో భాగస్వామ్యం ద్వారా 2030 నాటికి ఇరు సంస్థలు కలిసి 5 కోట్ల మీల్స్ పేదలకు అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఐక్యరాజ్యసమితి ప్రకారం, దేశంలో 19.5 కోట్ల మంది పోషకాహార లోపంతో ఉన్నారు. ఇది ప్రపంచ జనాభాలో నాలుగో వంతు కావడం గమనార్హం.