TCS: రూ.66 స్పెషల్ డివిడెండ్ ప్రకటించిన టీసీఎస్
ఒక్కో షేర్‌కు రూ. 10 మధ్యంతర డివిడెండ్‌తో పాటు రూ. 66 స్పెషల్ డివిడెండ్ ఇవ్వనున్నట్టు పేర్కొంది
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ డిసెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలను ప్రకటించింది. ప్రధాన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కన్స్యూమర్ బిజినెస్ విభాగాల్లో పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడంతో డిసెంబర్ త్రైమాసికంలో రూ. 12,380 కోట్ల లాభాలను సాధించినట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వెల్లడించిన రూ. 11,058 కోట్ల కంటే 12 శాతం అధికం. ఆదాయం కూడా 2023-24 డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ. 60,583 కోట్ల నుంచి రూ. 63,973 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఈ నేపథ్యంలో త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ ఒక్కో షేర్‌కు రూ. 10 మధ్యంతర డివిడెండ్‌తో పాటు రూ. 66 స్పెషల్ డివిడెండ్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. డివిడెండ్ పొందడానికి జనవరి 17ను రికార్డు తేదీగా నిర్ణయించామని చెప్పిన కంపెనీ ఫిబ్రవరి 3న చెల్లింపులు చేపట్టనున్నట్టు వివరించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీలో ఉద్యోగులు 5,000 మంది దాకా తగ్గారని, ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరంలో అనుకున్న ప్రకారమే నియామకాలు చేపట్టనున్నట్టు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. ఈ ఏడాదిలో ప్రధానంగా క్యాంపస్ నియామకాలపై దృష్టి సారించనున్నట్టు మిలింద్ స్పష్ట చేశారు. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గురువారం కంపెనీ షేర్ ధర 1 శాతం మేర నష్టపోయి రూ. 4,044 వద్ద ఉంది.