Online Ads: ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్నును రద్దు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన
తొలిసారిగా 2016, జూన్ 1న ప్రభుత్వం ఆన్‌లైన్ ప్రకటనలపై ఈక్వలైజేషన్ లెవీని అమల్లోకి తీసుకొచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఫైనాన్స్ బిల్లు-2025లో సవరణల్లో భాగంగా కేంద్రం ఆన్‌లైన్ ప్రకటనలపై ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును రద్దు చేయాలని ప్రభుత్వం సోమవారం ప్రతిపాదించింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ-కామర్స్ లావాదేవీలపై 2 శాతం ఉన్న ఈక్వలైజేషన్ లెవీని తొలగించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ ప్రకటనలపై 6 శాతం లెవీ కొనసాగిస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార పన్నుల విషయంలో దూకుడుగా వ్యవహరించడం, ఏప్రిల్ 2 నుంచి టారిఫ్‌ల అమలు ఉంటుందని చెప్పిన నేపథ్యంలో అనుకూల వైఖరిలో భాగంగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా 2016, జూన్ 1న ప్రభుత్వం ఆన్‌లైన్ ప్రకటనలపై ఈక్వలైజేషన్ లెవీని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ-కామర్స్ లావాదేవీలపై 2 శాతం పన్ను ఉండటంపైనే అమెరికా నుంచి విమర్శలు వచ్చాయి. దేశీయంగా మరింత పన్ను తగ్గింపులను వారు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ వైఖరి కారణంగా ఆన్‌లైన్ ప్రకటనలపైనా డిజిటల్ పన్నును తొలగించే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు యూఎస్ లాంటి భాగస్వామ్య దేశాల నుంచి వినిపిస్తున్న ఆందోళనలను పరిష్కరించినట్టు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది కాకుండా ఈక్వలైజేషన్ లెవీ రద్దుతో పాటు విదేశీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం సవరణలు చేపట్టాలని భావిస్తోంది. సెర్చ్ అండ్ సీజ్ నిబంధనలు, ఆదాయపు పన్ను రిటర్నుల కింద పన్ను మదింపులకు సంబంధించిన మార్పులు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.