విలీనం కానున్న క్రాంప్టన్, బటర్‌ఫ్లై బ్రాండ్లు!

దేశీయ గృహోపకరణాల బ్రాండ్ బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రిక్స్(సీజీసీఈఎల్) సంస్థలు విలీనం కానున్నాయి.

Update: 2023-03-26 12:31 GMT

ముంబై: దేశీయ గృహోపకరణాల బ్రాండ్ బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రిక్స్(సీజీసీఈఎల్) సంస్థలు విలీనం కానున్నాయి. ఇరు సంస్థల వ్యాపారాల వృద్ధి మరింత వేగవంతం చేయడంతో పాటు మార్కెట్లో చొచ్చుకుపోయే మార్గాలను సులభతరం చేసేందుకు విలీనాన్ని ప్రకటించాయి. విలీనం తర్వాత రికార్డు తేదీ నాటికి బటర్‌ఫ్లై పబ్లిక్ షేర్‌హోల్డర్లు విలీనానికి సంబంధించి కంపెనీలో ఉన్న ప్రతి ఐదు ఈక్విటీ షేర్లకు క్రాంప్టన్‌కు చెందిన 22 ఈక్విటీ షేర్లను పొందుతారని కంపెనీ తెలిపింది.

తమ నిర్ణయంతో భారత గృహోపకరణాల మార్కెట్లో కంపెనీ విస్తరణను వేగవంతం చేస్తుంది. తద్వారా కొత్త ఉత్పత్తులపై దృష్టి సారించడంతో పాటు వాటాదారుల విలువ పెరుగుతుందని క్రాంప్టన్ మేనేజింగ్ డైరెక్టర్ శంతను ఖోస్లా అన్నారు. రెండు బ్రాండ్ల విలీనం వల్ల బటర్‌ఫ్లై క్రాంప్టన్ దేశవ్యాప్తంగా మార్కెట్లో సమర్థవంతమైన పోటీనిస్తుంది. క్రాంప్టన్ ద్వారా వినియోగదారులకు మరిన్ని ఉత్పత్తులు అందించగలమని బటర్‌ఫ్లై మేనేజింగ్ డైరెక్టర్ రంగరజాన్ శ్రీరామ్ చెప్పారు. కాగా, 2022, ఫిబ్రవరిలో సీజీసీఈఎల్ బటర్‌ఫ్లైలో 81 శాతం వాటాను రూ. 2,076 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడుకు చెందిన బటర్‌ఫ్లై సంస్థ వంటగది, గృహోపకరణాల విభాగంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది.

Tags:    

Similar News