Paytm: పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్‌లో పెట్టుబడులకు కేంద్రం ఆమోదం

పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దాని మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కు కేంద్ర ఆమోదం తెలిపింది.

Update: 2024-08-28 14:14 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దాని మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కు కేంద్ర ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. అంతకుముందు, నవంబర్ 2022లో లైసెన్స్ పర్మిట్ కోసం దరఖాస్తు చేయగా దానిని ఆర్‌బీఐ తిరస్కరించింది. భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంటూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల ప్రకారం, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

లైసెన్స్ తిరస్కరించే సమయంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ పేటీఎం‌లో అతిపెద్ద వాటాను కలిగి ఉంది. అలాగే, ఒకే సంస్థ ఏకకాలంలో ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్, పేమెంట్ అగ్రిగేటర్ సేవలను అందించదని తెలిపింది. రెండు వ్యాపారాలు వేరు వేరు సంస్థలుగా ఉండాలని సూచించింది. దీంతో పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్‌‌కు లైసెన్స్ ఇవ్వలేదు. కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, స్వదేశీ భారతీయ కంపెనీగా పేటీఎం, ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు సహకారం అందించడం, అభివృద్ధిపై దృష్టి పెట్టిందని అన్నారు.


Similar News