Space Sector: స్పేస్ సెక్టార్ స్టార్టప్‌ల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్‌కు క్యాబినెట్ ఆమోదం
దేశీయ అంతరిక్ష సంస్థలను ప్రోత్సహిస్తూనే, మూలధన కేటాయింపు ద్వారా ఈ రంగంలో అభివృద్ధికి ప్రభుత్వం ఆశిస్తోంది.
దిశ, బిజినెస్ బ్యూరో: అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల అభివృద్ధి కోసం వెంచర్ కేపిటల్ ఫండ్‌కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. 40 స్టార్టప్‌లకు మద్దతిచ్చేందుకు రూ. 1,000 కోట్ల వరకు ఫండ్‌ను అందించనుంది. ఈ నిర్ణయంతో దేశీయంగా ప్రైవేట్ స్పేస్ సెక్టార్ వృద్ధి వేగవంతమవుతుందని, స్పేస్ టెక్నాలజీతో మరింత పురోగతి సాధించేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ అంతరిక్ష సంస్థలను ప్రోత్సహిస్తూనే, తాజా మూలధన కేటాయింపు ద్వారా ఈ రంగంలో అభివృద్ధిని సులభతరం చేయనుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ఫండింగ్ ప్రక్రియ ఐదేళ్ల వరకు ఉంటుంది. సగటున ఏడాదికి రూ. 150-250 కోట్ల వరకు కేటాయించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 150 కోట్ల నిధులను ప్రభుత్వం అంచనా వేసింది. ఆ తర్వాత మూడేళ్లకు రూ. 250 కోట్ల నిధిని కేటాయిస్తే, చివరి ఏడాది రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ నిధిని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఐఎన్-స్పేస్) నిర్వహిస్తుంది. ఈ ఏజెన్సీ స్పేస్ సెక్టార్‌లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. దీన్ని 2022లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.