Byju's : అప్పులు చెల్లించే ప్రయత్నాల్లో బైజూస్!
గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ అప్పులు చెల్లించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
బెంగళూరు: గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ అప్పులు చెల్లించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సుమారు రూ. 9,949 కోట్ల టర్మ్ రుణాలను చెల్లించడానికి కంపెనీకి చెందిన ఓవర్సీస్ వెంచర్లు గ్రేట్ లెర్నింగ్, ఎపిక్‌లను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. అమెరికాలోని కిడ్స్ లెర్నింగ్ కంపెనీ ఎపిల్ అప్‌స్కిల్లింగ్ ప్లాట్‌ఫామ్ గ్రేట్ లెర్నింగ్‌ల అమ్మకం ద్వారా సుమారు 1 బిలియన్ డాలర్లు సమకూరుతాయని బైజూస్ అంచనా వేస్తోంది.
ఇప్పటికే అవసరమైన రుణదాతలతో బైజూస్ చర్చలు జరుపుతోందని, వచ్చే మూడు నెలల కాలంలో 300 మిలియన్ డాలర్లు, అనంతరం మరో 3 నెలల్లో మిగిలిన మొత్తాలను చెల్లించాలని బైజూస్ భావిస్తోంది. వీటితో పాటు ఈక్విటీ షేర్ల నుంచి, కీలక ఆస్తుల విక్రయం కోసం బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి బైజూస్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.