చదువు కంటే పెళ్లిళ్లకు రెట్టింపు ఖర్చు చేస్తున్న భారతీయులు

భారత్‌లో సంవత్సరానికి 80 లక్షల నుంచి కోటి పెళ్లిళ్లు జరుగుతాయి.

Update: 2024-06-30 12:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వివాహాలకు, వేడుకలకు అయ్యే ఖర్చు మిగిలిన వాటి కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో వివాహ పరిశ్రమ సుమారు రూ. 10 లక్షల కోట్ల(130 బిలియన్ డాలర్లు)ను దాటేసింది. ఇది దేశంలో ఫుడ్ అండ్ గ్రాసరీ మార్కెట్ తర్వాత వివాహ పరిశ్రమదే అత్యధిక ఖర్చు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ప్రకారం.. సగటున భారతీయులు చదువు కంటే పెళ్లిళ్ల వేడుకల కోసమే రెట్టింపు ఖర్చు చేస్తున్నారు. చైనాలో ప్రతి ఏడాది 70-80 లక్షలు, అమెరికాలో 20-25 లక్షల వివాహాలు జరుగుతాయి. అదే భారత్‌లో సంవత్సరానికి 80 లక్షల నుంచి కోటి పెళ్లిళ్లు జరుగుతాయి. అంటే భారత వివాహ పరిశ్రమ అమెరికా(70 బిలియన్ డాలర్లు)లో జరిగే పెళ్లిళ్ల కంటే దాదాపు రెట్టింపు పరిమాణంలో ఉంది. చైనాలో పెళ్లిళ్ల కోసం 170 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 14 లక్షల కోట్లకు పైమాటే) ఖర్చవుతోంది. భారత్‌లో పెళ్లిళ్ల ఖర్చు ఫుడ్ అండ్ గ్రాసరీ మార్కెట్(రూ. 57 లక్షల కోట్ల) తర్వాత అతిపెద్ద రిటైల్ మార్కెట్‌గా రెండో స్థానంలో ఉంది. భారత్‌లో వివాహాల కోసం ముఖ్యంగా ఆభరణాలు, దుస్తుల విభాగంలో ఎక్కువ ఖర్చు జరుగుతుంది. పరోక్షంగా వాహన, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు దోహదపడుతోంది. పెళ్లిళ్ల కోసం ఎక్కువ ఖర్చు చేయకుండా కట్టడికి కేంద్ర ప్రభుత్వం సైతం ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ భారతీయులు పెళ్లి ఖర్చులో వెనుకాడేందుకు ఇష్టపడటంలేదు. 

Similar News