ఈ ఏడాది 4 ట్రిలియన్ డాలర్లకు భారత జీడీపీ: సంజీవ్ సన్యాల్
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అన్నారు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అన్నారు. మంగళవారం UKలో జరిగిన కేంబ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భారత్ వేగవంతమైన వృద్ధిని కనబరుస్తుంది, ఈ ఏడాదిలో జపాన్ ఆర్థిక వ్యవస్థకు సమానంగా భారత ఆర్థిక వ్యవస్థ ఉంటుందని చెప్పారు. మొదటి ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడానికి భారత్‌కు 16-17 సంవత్సరాలు పట్టింది. 2014-15లో $2 ట్రిలియన్ల మార్కును చేరుకుంది, దీనిని చేరుకోవడానికి 7 సంవత్సరాలు పట్టిందని అన్నారు.
2021-22 భారత ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ల మార్కును చేరుకోవడానికి మరో 7 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కరోనా కారణంగా రెండు సంవత్సరాలు ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు $4 ట్రిలియన్ల మార్కును చేరడానికి మూడు సంవత్సరాలు, $5 ట్రిలియన్ల మార్కును చేరడానికి మరో రెండేళ్లు పడుతుందని ఆయన అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే, భారతదేశం 2027 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని సంజీవ్ తెలిపారు.
అంతకుముందు ప్రధాన రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేయగా, ఐఎంఎఫ్, S&P రేటింగ్స్, మోర్గాన్ స్టాన్లీ భారతదేశ వృద్ధి రేటు ఎఫ్‌వై25కి 6.8 శాతంగా అంచనా వేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరానికి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిని 7.2 శాతంగా అంచనా వేసింది.