Stock Market: 1,190 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా బలహీనపడ్డాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు మరోసారి భారీ నష్టాలు ఎదురయ్యాయి. అంతకుముందు ట్రేడింగ్‌లో దేశీయ పరిణామాల మధ్య సానుకూలంగా ముగిసిన సూచీలు గురువారం ఉదయం మిశ్రమ ర్యాలీతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా బలహీనపడ్డాయి. ప్రధానంగా అమెరికా ఆర్థిక విధానాలపై ఆందోళనలకు తోడు వడ్డీ రేట్లపై అంచనాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు గ్లోబల్ మార్కెట్లపై ప్రభావితం చేశాయి. తద్వారా కీలక ఐటీ, ఫార్మా రంగాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా పతనమైంది. ముఖ్యంగా ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా భారీ దాడి చేసిన తర్వాత మిడ్-సెషన్ నుంచి భారతీయ ఈక్విటీలు మరింత క్షీణించాయి. ఈ క్రమంలోనే నిఫ్టీ 24 వేల దిగువకు పడిపోయింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,190.34 పాయింట్లు నష్టపోయి 79,043 వద్ద, నిఫ్టీ 360.75 పాయింట్ల నష్టంతో 23,914 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ మినహా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ మాత్రమే లాభాలను దక్కించుకుంది. ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టైటాన్ స్టాక్ 2-4 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.48 వద్ద ఉంది. భారీ నష్టాల కారణంగా గురువారం ఇన్వెస్టర్ల సంపద రూ. 1.51 లక్షల కోట్లు క్షీణించింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 442.96 లక్షల కోట్లకు చేరుకుంది.