LIC: ఆరోగ్య బీమా విభాగంలోకి అడుగుపెట్టనున్న ఎల్ఐసీ

ఇందులో ఉన్న డిమాండ్‌ను తీర్చేందుకు అవకాశాలు ఉన్నాయని ఎల్ఐసీ భావిస్తోంది.

Update: 2024-11-28 10:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఆరోగ్య బీమా విభాగంలోకి అడుగుపెట్టనుంది. దానికోసం మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో 50 శాతం మేర వాటాను కొనేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఇప్పటివరకు జీవిత బీమాకే పరిమితమైన, హెల్త్ పాలసీ విభాగంలోకి ప్రవేశించాలని భావిస్తున్న ఎల్ఐసీకి ఇది కీలక పరిణామం కానుంది. చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని సమాచారం. వెంచర్‌లో సగం వాటా కోసం ఎల్ఐసీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రూ. 3 లక్షల సాధారణ బీమా రంగంలో హెల్త్ ఇన్సూరెన్స్ 37 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో ఉన్న డిమాండ్‌ను తీర్చేందుకు అవకాశాలు ఉన్నాయని ఎల్ఐసీ భావిస్తోంది. మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ రెండు కంపెనీల జాయింట్ వెంచర్. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మణిపాల్ గ్రూప్, అమెరికాకు చెందిన సిగ్నా కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇందులో మణిపాల్ గ్రూప్‌నకు 51 శాతం, సిగ్నాకు 49 శాతం వాటా ఉంది. ఎల్ఐసీతో చర్చలు పూర్తయితే ఇరు సంస్థలు తమ వాటాలను తగ్గించుకోనున్నాయి. దీనికోసం ఎల్ఐసీ దాదాపు రూ. 2,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News