తక్కువ నష్టాలతో ముగిసిన సూచీలు
కీలక బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా బలహీనపడ్డాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతకుముందు సెషన్‌లో మెరుగైన లాభాలతో ర్యాలీ చేసిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. ఓ దశలో ఆల్‌టైమ్ హై స్థాయిలను తాకిన తర్వాత కీలక బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా బలహీనపడ్డాయి. ఉదయం ఐటీ రంగాల షేర్లలో ర్యాలీ కారణంగా సెన్సెక్స్ 79,856 వద్ద సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకింది. అయితే, మిడ్-సెషన్‌కు ముందు బ్యాంకింగ్‌తో పాటు ఆటో, ఎఫ్‌ఎంసీజీ సహా కీలక రంగాల్లో మదుపర్లు షేర్లను విక్రయించారు. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు దిగడంతో రోజంతా బలహీనంగానే సాగిన స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగానే ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 34.74 పాయింట్లు క్షీణించి 79,441 వద్ద, నిఫ్టీ 18.10 పాయింట్లు నష్టపోయి 24,123 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా మినహా మిగిలిన రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.45 వద్ద ఉంది.