పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితులు!

త్వరలో పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై(ఎఫ్‌డీఐ) కేంద్ర ప్రభుత్వం పరిమితులు తీసుకురావాలని చూస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి

Update: 2024-07-02 10:52 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: త్వరలో పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై(ఎఫ్‌డీఐ) కేంద్ర ప్రభుత్వం పరిమితులు తీసుకురావాలని చూస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సిగరెట్ తయారీ కంపెనీలకు ఎఫ్‌డీఐ పరిమితుల పరిధిని విస్తృతం చేయాలని ప్రభుత్వం గత కొంత కాలంగా చర్చిస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై ముందడుగు పడింది. త్వరలో దీని గురించి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన వాణిజ్య మంత్రిత్వ శాఖ వద్ద చర్చలో ఉందని, ఆమోదం కోసం క్యాబినెట్‌కు పంపవచ్చని నివేదిక పేర్కొంది. సిగరెట్, పొగాకు కంపెనీలకు విదేశీ టెక్నాలజీలో సహకారానికి సంబంధించిన పెట్టుబడిపై కూడా పరిమితి ఉంటుందని తెలుస్తుంది.

పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఏదైనా ఫ్రాంచైజీలో ఎఫ్‌డీఐ, ట్రేడ్‌మార్క్, పొగాకు ఇతర దాని బ్రాండింగ్‌లో పరిమితులు ఉంటాయి. ఈ నివేదిక తర్వాత ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్, ఎన్‌టీసీ ఇండస్ట్రీస్, గోల్డెన్ టొబాకో షేర్లు 1-3 శాతం మధ్య పడిపోయాయి. గత కొంత కాలంగా పొగాకు పరిశ్రమ ఒత్తిళ్లను ఎదుర్కొంటుంది. ఆరోగ్య ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలు, ధూమపానంపై అవగాహన ప్రచారం కారణంగా కూడా కాలక్రమేణా సిగరెట్ వినియోగం తగ్గిపోతుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న VST ఇండస్ట్రీస్ సిగిరేట్ కంపెనీ పరిమాణం 8556 మిలియన్ యూనిట్ల నుండి 8253 మిలియన్ యూనిట్లకు తగ్గిపోయింది.


Similar News