చెప్పకుండా రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు పెంచిన ఎయిర్‌టెల్
ఆర్పు పెంచే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన సబ్‌స్క్రైబర్లకు షాక్ ఇచ్చింది. రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను చెప్పాపెట్టకుండా పెంచేసింది. వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) పెంచే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 4జీ ప్లాన్‌లైన రూ. 118ని రూ. 129కి, రూ. 289 ప్లాన్‌ని రూ. 329కి పెంచుతూ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో మార్పులు చేసింది. రూ. 129 ప్రీపెయిడ్ ప్లాన్ బేస్ ప్లాన్‌తో వస్తుంది. 12జీబీ డేటా లభించే ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనాలేమీ లేవు. కానీ, ధర పెంచిన కారణంగా ఒక్కో జీబీకి అయ్యే ఖర్చు రూ. 9.83 నుంచి రూ. 10.75కి పెరిగింది. అలాగే, 4జీబీ డేటాతో కూడిన రూ. 329 ప్లాన్ 35 రోజుల కాలపరిమితితో వస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 300 మేసేజ్‌లతో పాటు అదనపు ఛార్జీలు లేకుండా 24 గంటల అపోలో సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ లాంటి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు కలిగి ఉంటాయి.