రుణ రేట్లను పెంచిన యాక్సిస్ బ్యాంక్!
ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ వివిధ రుణాలపై ప్రభావం చూపే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 25Latest Telugu News
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ వివిధ రుణాలపై ప్రభావం చూపే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. సవరించిన రుణ రేట్లు మంగళవారం(అక్టోబర్ 18) నుంచే అమలవుతాయని బ్యాంకు తెలిపింది. అధికారిక వివరాల ప్రకారం, ఓవర్‌నైట్ నుంచి మూడేళ్ల కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు సవరించిన తర్వాత 8.15 శాతం నుంచి 8.50 శాతం మధ్య ఉండనుంది. ఇందులో మూడు నెలల ఎంసీఎల్ఆర్‌పై 8.25 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వినియోగదారులు తీసుకునే రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి పెరిగింది. 2 ఏళ్ల కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా నిర్ణయించినట్టు బ్యాంకు వివరించింది.
సెప్టెంబర్ నెలలో జరిగిన పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లతో 5.90 శాతానికి పెంచిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ రుణ రేట్లను పెంచింది. బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం వల్ల వినియోగదారులు తీసుకునే గృహ, వ్యక్తిగత, వాహనాల రుణాల చెల్లింపులో ఈఎంఐలపై భారం పడనుంది. కాగా, ఆర్‌బీఐ రేట్ల పెంపునకు అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్‌ఆర్ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 7.95 శాతానికి చేర్చింది. దీంతో పాటే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను 8.75 శాతానికి పెంచింది.