నెలకు 210 రూపాయలతో జీవితాంతం రూ.5000 పెన్షన్
ప్రభుత్వ ఉద్యోగులకు 60 ఏళ్లు దాటిన తరువాత ఆర్థికంగా ఉపయోగపడటానికి పెన్షన్ వస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులకు 60 ఏళ్లు దాటిన తరువాత ఆర్థికంగా ఉపయోగపడటానికి పెన్షన్ వస్తుంది. కానీ అసంఘటిత రంగంలోని కార్మికులకు మాత్రం 60 ఏళ్లు దాటాక ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ఎలాంటి సామాజిక పథకాలు లేవు. దీంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ‘అటల్ పెన్షన్ యోజన’ అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులు వారి వయసు పైబడిన తర్వాత జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5.2 కోట్ల మందికి పైగా నమోదు చేసుకున్నారు.
అర్హతలు:
ఈ పథకంలో చేరడానికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు. పోస్టాఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ పథకానికి సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయి. వేరే ప్రభుత్వ పథకాల నుంచి పెన్షన్ పొందేవారు ఈ స్కీమ్‌లో చేరలేరు. దీనిలో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత వారు మరణించే వరకు రూ. 1000 నుంచి రూ.5000 వరకు చెల్లిస్తారు. పెన్షన్ చెల్లింపు అనేది దరఖాస్తు దారుని వయసు, ప్రీమియం ఆధారంగా మారుతుంది.
ప్రీమియం చెల్లింపు:
అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారు ప్రీమియం చెల్లింపు అనేది వారి వయసును బట్టి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో చేరే వారు 60 ఏళ్లు వచ్చేంత వరకు అంటే 42 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. ఈ వయసు వారు నెలకు రూ. 210 చెల్లించినట్లయితే జీవితాంతం రూ. 5000 పెన్షన్ పొందగలరు. అదే 40 ఏళ్ల వయసు వారు రూ.5 వేలు కావాలనుకుంటే నెలకు రూ.1454 చెల్లించాల్సి ఉంటుంది.
పెన్షన్ చెల్లింపు:
ఈ స్కీమ్‌లో చేరిన వారు 60 ఎళ్ల తరువాత నిర్ధిష్ట ప్రాతిపదికన ప్రతి నెలా రూ. 1000 లేదా రూ.2000 లేదా రూ. 3000 లేదా రూ. 4000 లేదా రూ. 5000 వరకు పెన్షన్ పొందుతారు. ఈ అమౌంట్ వారు చెల్లించే ప్రీమియం ఆధారంగా ఉంటుంది. ఒక్కసారి ఈ పథకంలో చేరిన వారు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ ఫీచర్‌ను ఎంచుకోవాలి. దీని ద్వారా ప్రతి నెలా బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది. చెల్లింపుల సమయంలో బ్యాంకులో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి, లేకుంటే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.
అప్లికేషన్ విధానం:
ఈ పథకం అన్ని బ్యాంకులు/పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. సంబంధిత పేపర్స్ తీసుకుని అధికారులను సంప్రదించాలి. ఆన్‌లైన్ ద్వారా ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవచ్చు. https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెబ్‌సైట్‌కు వెళ్లి ‘అటల్ పెన్షన్ యోజన’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే APY REGISTRATION అనే దానిని ఎంచుకుని అక్కడ అడిగిన వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
ఈ పథకంలో చేరిన తరువాత మధ్యలో దరఖాస్తు దారు మరణిస్తే 60 ఏళ్లు వచ్చే వరకు వారి జీవిత భాగస్వామి ఖాతాను కొనసాగించవచ్చు. వయసు దాటిన తర్వాత వారి జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. ఖాతాను మూసివేయాలనుకుంటే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడితో పాటు దానిపై వడ్డీని కూడా లెక్కగట్టి భాగస్వామికి చెల్లిస్తారు. మరణించిన వ్యక్తికి పెళ్లి కాకపోతే నామినీకి ప్రయోజనాలను అందజేస్తారు. ముఖ్యంగా ఈ ఖాతాలో వరుసగా ఆరు నెలల పాటు ప్రీమియం చెల్లించకపోతే పెన్షన్ ఖాతాను ఆపేస్తారు. ఒకవేళ ఏడాది పాటు ప్రీమియం చెల్లించకపోతే పెన్షన్ ఖాతాను డీ యాక్టివేట్ చేస్తారు.
ఇవి కూడా చదవండి:
వరుసగా 72 గంటలు బ్యాంకులు బంద్.. ఈనెలలోనే!
రూ. 21 వేలకే iPhone 13.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 48 వేల భారీ డిస్కౌంట్