చైనా ఇస్తోన్న రుణాల విషయంలో అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది: డొనాల్డ్ లూ

పాకిస్తాన్, శ్రీలంకలకు ఆర్థిక అవసరాల కోసం చైనా ఇస్తోన్న రుణాల విషయంలో అమెరికా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ అన్నారు.

Update: 2023-02-25 05:09 GMT

న్యూఢిల్లీ: పాకిస్తాన్, శ్రీలంకలకు ఆర్థిక అవసరాల కోసం చైనా ఇస్తోన్న రుణాల విషయంలో అమెరికా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ అన్నారు. చైనా ఈ రుణాల ద్వారా బలవంతంగా తన పరపతి పెంచుకోవడానికి అలాగే, తన ఇతర అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించవచ్చని ఆయన అన్నారు. అలాగే ఈ విషయంలో భారత్‌తో చర్చలు జరుగుతున్నట్లు లూ పేర్కొన్నారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం మార్చి 1 నుంచి 3 వరకు న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు డొనాల్డ్ లూ ఈ వ్యాఖ్యలు చేయడం కీలక పరిణామం. అంతకుముందు రోజు, పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, బోర్డ్ ఆఫ్ చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ (సిడిబి) దేశానికి 700 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు.

G20 అధ్యక్ష పదవిని విజయవంతం చేసేందుకు భారత్‌కు అమెరికా మద్దతు ఉంటుందని లూ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి, వాటిని పరిష్కరించడానికి ఇతర G20 దేశాలతో మా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలనుకుంటున్నట్లు ఆయన అన్నారు. క్వాడ్ సైనిక కూటమిపై లూ మాట్లాడుతూ.. “క్వాడ్ ఏ ఒక్క దేశానికి లేదా దేశాల సమూహానికి వ్యతిరేకంగా ఉండే సంస్థ కాదు. క్వాడ్ అంటే ఇండో-పసిఫిక్‌కు మద్దతిచ్చే కార్యకలాపాలు, విలువలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది“ అని ఆయన అన్నారు.

Tags:    

Similar News