Inflation: తగ్గిన వ్యవసాయ, గ్రామీణ కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం

ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లు కనబడుతుంది.

Update: 2024-08-29 13:31 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లు కనబడుతుంది. తాజాగా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, జులై నెలలో వ్యవసాయ, గ్రామీణ కార్మికులు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది జూన్‌లో వ్యవసాయ రిటైల్ ద్రవ్యోల్బణం 7.02 శాతం కాగా, జులై నెలలో ఇది 6.17 శాతానికి తగ్గింది. అలాగే, గ్రామీణ కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.04 శాతం కాగా, జులై నెలలో 6.20 శాతానికి తగ్గింది.

వ్యవసాయ, గ్రామీణ కార్మికుల అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ జులైలో 10 పాయింట్లు పెరిగి వరుసగా 1,290, 1,302కు చేరుకుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవి గత ఏడాది వరుసగా 1,280 పాయింట్లు, 1,292 పాయింట్లుగా ఉన్నాయి. వ్యవసాయ, గ్రామీణ కార్మికుల ద్రవ్యోల్బణం తగ్గడం స్వాగతించే విషయం. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. గతంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశ ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేశారు. స్థిరమైన పట్టణ వినియోగం ద్వారా దేశీయ వృద్ధి స్థితిస్థాపకంగా ఉంటుందని, ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.


Similar News