Adani Group: భారత్‌కు వెలుపల జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే యోచనలో అదానీ గ్రూప్

భారత్‌కు వెలుపల 10 గిగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని యోచిస్తోంది

Update: 2024-10-10 19:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ భవిష్యత్తులో అంతర్జాతీయంగా వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావిస్తోంది. తాజాగా ఈ లక్ష్యాన్ని చేరేందుకు భారత్‌కు వెలుపల 10 గిగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని యోచిస్తోంది. దీని ద్వారా 2050 నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని చేరేందుకు సహాయపడుతుందని కంపెనీ ఆశిస్తోంది. రాయిటర్స్ ప్రకారం.. అదానీ గ్రూప్ నేపాల్, భూటాన్, కెన్యా, టాంజానియా, వియత్నాం, ఫిలిప్పీన్ వంటి దేశాల్లో ఎక్కడైనా ఈ ప్రాజెక్టులను నిర్మించేందుకు పరిశీలిస్తోంది. జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఈ దేశాలు అనుకూలంగా ఉంటాయని అదానీ గ్రూప్ భావిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి సమీక్ష దశలోనే ఉందని, అదానీ గ్రూప్ ప్రతినిధులు ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ వాటాదారులతో మాట్లాడుతోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ భూటాన్‌లోని చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూటాన్ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో పవర్ ప్రాజెక్టులను నిర్మించేందుకు డెవలపర్లతో అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోంది. నేపాల్, భూటాన్‌ల నుంచి విద్యుత్‌ను భారత్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Tags:    

Similar News