శ్రీలంకతో 20 ఏళ్ల విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్న అదానీ గ్రీన్ ఎనర్జీ
అదానీ గ్రీన్, శ్రీలంక ప్రభుత్వం మధ్య 20 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరుగుతుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: గౌతమ్ అదానీ నేతృత్వంలోని దేశీయ ఎనర్జీ కంపెనీ అదానీ గ్రీన్ శ్రీలంక ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలో పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం అదానీ గ్రీన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు శ్రీలంక కేబినెట్ మంగళవారం ప్రకటించింది. కేబినెట్ ఆమోదం ప్రకారం, అదానీ గ్రీన్, శ్రీలంక ప్రభుత్వం మధ్య 20 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరుగుతుంది. గత ఏడాది ఫిబ్రవరిలో అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా 442 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఆమోదం లభించింది. శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్‌లో ఉన్న మన్నార్, పూనేరిన్‌లలో 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌లను అదానీ ఎనర్జీ కంపెనీ అభివృద్ధి చేయనుంది. ఆర్థికంగా కుదేలైన శ్రీలంక 2022లో ఆర్థిక మాంద్యం కారణంగా తీవ్రమైన విద్యుత్ అంతరాయం, ఇంధన కొరతను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంధన దిగుమతి ఖర్చులను తగ్గించేందుకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.