Honda: హోండా ఎంట్రీతో ఈవీ మార్కెట్లో పెరిగిన పోటీ
ఈవీ మార్కెట్లో పోటీ మరింత తీవ్రమవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత వాహన రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇటీవల అనేక కంపెనీలు తమ ఈవీ మోడళ్లతో మార్కెట్లను ముంచెత్తాయి. ఈ క్రమంలోనే చాలా కాలంగా ఎదురుచూస్తున్న జపాన్ కంపెనీ హోండా కూడా ఎట్టకేలకు ఈవీ విభాగంలోకి అడుగుపెట్టింది. హోండా మోటార్ కంపెనీ ఇండియా విభాగం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రెండు ఈవీ స్కూటర్లను విడుదల చేసింది. దీంతో ఈవీ మార్కెట్లో పోటీ మరింత తీవ్రమవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇంధన విభాగంలో ఎక్కువ ఆదరణ కలిగిన యాక్టివాతో ఆటు కొత్తగా క్యూసీ1 పేరుతో తీసుకొచ్చిన ఈ ఈవీ స్కూటర్లు దాదాపు 99 శాతం స్థానికంగా తయారు చేసినట్టు కంపెనీ వెల్లడించింది. వాటికి అవసరమైన బ్యాటరీలను కూడా స్థానిక సరఫరాదారుల నుంచే సేకరించినట్టు కంపెనీ పేర్కొంది. వీటిని కర్ణాటకలోని నర్సాపూర్‌లో ఉన్న ప్లాంటులో తయారు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. మొదటి ఏడాదిలో కంపెనీ 1,00,000 యూనిట్ల ఈవీలను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. క్యూసీ1 మోడల్ ఈవీ బుకింగ్‌లు కొత్త ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి నుంచి డెలివరీ చేయనుంది. ప్రస్తుతానికి యాక్టివా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో మాత్రమే అందుబాటులో ఉంది. క్యూసీ1 ఎంపిక చేసిన నగరాల్లో ఉంది. ఇప్పటికే దేశీయ ఈవీ టూవీలర్ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, ఓలా స్కూటర్లు, హీరో వీదా, హీరో ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, బజాజ్ వంటి కంపెనీలు అధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. హోండా ఎంట్రీతో పోటీ మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.