పాగా కోసం బీజేపీకి జాగా ఉందా!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీపరంగా విస్తరించేందుకు, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు తనదైన వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే తాము అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమనీ, మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరిగిందని ఆ పార్టీ చీఫ్ లక్ష్మణ్ చెబుతున్నారు. ఏపీలో జనసేనతో మిత్రపక్షంగా ఉండి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని, అక్కడా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రజాస్వామ్యంలో పార్టీలు […]
దిశ, వెబ్‌డెస్క్:
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీపరంగా విస్తరించేందుకు, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు తనదైన వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే తాము అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమనీ, మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరిగిందని ఆ పార్టీ చీఫ్ లక్ష్మణ్ చెబుతున్నారు. ఏపీలో జనసేనతో మిత్రపక్షంగా ఉండి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని, అక్కడా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎదిగేందుకు, తమపట్టు నిలుపుకునేందుకు పొత్తులు, ఎత్తులు, వ్యూహాలు రచించుకోవడం, రాజ్యాధికారం చేజిక్కించుకునేందుకు కృషి చేయడంలో తప్పులేదనీ, కానీ, అందుకు మతవిభజన తీసుకురావడం, విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
భిన్న వ్యూహాలు..
బీజేపీ పార్టీ పరంగా ప్రతి రాష్ట్రానికీ ప్రాధాన్యమిస్తుంది. బూత్ స్థాయి నుంచి క్షుణ్ణంగా పరిశీలించి, రాజకీయ సమీకరణ చేస్తుంది. ఆ పార్టీకి సంస్థాగతంగా కార్యకర్తలు, ప్రజల సమీకరణ, ఎలక్టోరల్‌పరంగా ఘన విజయాలు సాధించేందుకు ఉపయోగపడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీకి బలమైన ఎలక్టోరల్ మెషినరీ ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఆ మెషినరీని పరిశీలిద్దాం.
బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ, ప్రతి ఎన్నికా ముఖ్యమే, సామాజిక వర్గాల పునరేకీకరణ. ఈ మూడు అంశాలు బీజేపీ ముఖ్యంగా అమలు చేస్తుందని పరిశీలకులు చెబుతారు. బూత్‌స్థాయి కార్యకర్తలతో అప్పటి బీజేపీ జాతీయ చీఫ్ అమిత్‌షా సమావేశాలు ప్రజలందరికీ తెలిసిందే. బీజేపీ ప్రతి ఎన్నికనూ చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. ఉదాహరణకు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారానికి అప్పట్లోనే అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుసహా ఐదుగురు మంత్రులు ప్రచారానికి వచ్చిన విషయం విదితమే. ఇక సామాజిక వర్గాలు పునరేకీకరణ విషయంలో బీజేపీకి స్పష్టత ఉంది. ఉదాహరణకు కర్నాటకలో లింగాయత్‌ల సామాజికవర్గం బలంగా ఉన్నందున ఆ వర్గ నాయుకుడు యెడ్యూరప్పకు సీఎం అభ్యర్థిత్వం ఇచ్చింది. ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గం కావున ఆయన ప్రభావితం చేయగలడనే పార్టీ చీఫ్‌గా ఎంపిక చేశారని అప్పట్లోనే పలువురు విశ్లేషించారు. నిజానికి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వెంటనే చీఫ్ ఇవ్వరేమో అని పలువురు అనుకున్నప్పటికీ ఆయనకే అనూహ్యంగా చీఫ్ పదవి వరించింది.
ఎదుగుదలకు పాచికలు
బీజేపీ తన ఎదుగుదలకు రకరకాల పాచికలు వేస్తుందని విమర్శకులు సైతం చెబుతుంటారు. భిన్న వాదనలు ప్రజల ముందుంచి తమను తాము పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారని చెబుతుంటారు. ఉదాహరణకు ప్రత్యేక హోదా, అమరావతే రాజధాని అన్న విషయాల్లో బీజేపీ ఏపీ నేతల భిన్న వ్యాఖ్యలు తెలిసినవే. అయితే, ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ ఆయన గ్లామర్ ఉపయోగించుకుని ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నమాట వాస్తవం.
ఇక తెలంగాణలో భిన్న వైఖరి ఉన్నది. తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ పటిష్టతపై దృష్టి సారించారేమో అని అనిపిస్తున్నదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. వివాదరహితుడిగా ఉన్న ఆయన ఇప్పుడూ వివాదాల్లోకే వెళ్లడమే ఇందుకు నిదర్శనమనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మెట్రో ప్రారంభోత్సవానికి తనకు ఆలస్యంగా ఆహ్వానం అందించడంపై రాద్ధాంతం చేసిన కిషన్ రెడ్డి, ఆ తర్వాత మెట్రోలో ప్రయాణించి పాతబస్తీకి మెట్రో రాకుండా మజ్లిస్, టీఆర్ఎస్‌లను యత్నిస్తున్నాయని ఆరోపిస్తారు. భైంసా ఘటనపై కూడా ఆయన మాట్లాడుతూ అల్లర్ల వెనుక మజ్లిస్, టీఆర్ఎస్‌లు ఉన్నాయని ఆరోపించారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఎర్ర బస్సు తప్ప రైలు తెలియదని మాట్లాడి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇంత జరిగినప్పటికీ కేంద్ర యంత్రాంగాన్ని ఉపయోగించుకుని మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఇకపై ఇంకా చురుకుగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశముందంటున్నారు. అయితే, తెలంగాణలోనూ పవన్‌తో కలిసి పని చేస్తామని బీజేపీ తెలంగాణ చీప్ లక్ష్మణ్ చెప్పారు. కానీ, ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణలో పవన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. అయితే, తెలంగాణలోనూ పవన్‌కు అశేష అభిమానులున్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన చీఫ్‌లు నియమితులవుతారాని మహారాష్ట్ర మాజీ గవర్నర్, ఆ పార్టీ సీనియర్‌నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు తెలిపారు. కొత్త చీఫ్‌లు పార్టీ అభివృద్ధికి ఏమేరకు పాటు పడతారో చూడాలి మరి..