కేసీఆర్ స్కెచ్ రిపీట్.. కొత్త నినాదంతో బీజేపీని గెలుపు వరించేనా..?

దిశప్రతినిధి, కరీంనగర్ : వేదిక మారినా లక్ష్యం మాత్రం మారకూడదని బీజేపీ భావిస్తోంది. జాతీయ నాయకత్వం చేస్తున్న దిశా నిర్దేశంతో రాష్ట్ర కమిటీ వ్యూహానికి పదును పెట్టే పనిలో నిమగ్నమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు వేదికను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హుస్నాబాద్‌లో ఏర్పాటు చేయబోయే సభను సక్సెస్ చేయడంతో పాటు హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా పావులు కదపాలని భావిస్తున్నారు బీజేపీ నాయకులు. ‘తెలంగాణ మాదే… హుజురాబాద్’మాదే అన్న నినాదాన్ని […]

Update: 2021-09-29 23:29 GMT

దిశప్రతినిధి, కరీంనగర్ : వేదిక మారినా లక్ష్యం మాత్రం మారకూడదని బీజేపీ భావిస్తోంది. జాతీయ నాయకత్వం చేస్తున్న దిశా నిర్దేశంతో రాష్ట్ర కమిటీ వ్యూహానికి పదును పెట్టే పనిలో నిమగ్నమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు వేదికను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హుస్నాబాద్‌లో ఏర్పాటు చేయబోయే సభను సక్సెస్ చేయడంతో పాటు హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా పావులు కదపాలని భావిస్తున్నారు బీజేపీ నాయకులు. ‘తెలంగాణ మాదే… హుజురాబాద్’మాదే అన్న నినాదాన్ని బలంగా వినిపించే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైంది.

భారీ జనసమీకరణ..

హుస్నాబాద్‌లో జరగనున్న ముగింపు సమావేశానికి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడంపై దృష్టి సారించారు. ఈ సభకు ముఖ్య నాయకులను ఆహ్వానించి హుజురాబాద్ ఎన్నికలపై ప్రభావం పడే విధంగా వ్యూహం రచిస్తున్నారు. ఈ సభ ద్వారా ఈటల రాజేందర్ గెలుపు కోసం ఎలాంటి సంకేతాలు పంపించాలి, ఎలా వ్యవహరించాలన్న విషయంపై రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు కసరత్తులు చేస్తున్నారు.

లాభించిన కొత్త జిల్లా..

తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావం ఓ రకంగా తమకు లాభించిందనే భావిస్తున్నారు బీజేపీ నాయకులు. హుజురాబాద్ పక్కనే ఉన్న హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో ఉండటం వల్ల తమ ప్రచారాన్ని కొనసాగించేందుకు సరైన వేదిక దొరికినట్టయిందని అనుకుంటున్నారు. ఉపఎన్నికల కోడ్ కరీంనగర్, హన్మకొండ జిల్లాలకే పరిమితం కావడం వల్ల సిద్దిపేట జిల్లాలో చేపట్టే కార్యక్రమానికి నిబంధనలు అడ్డు రాకపోవడం వల్ల తమ సభలకు ఎలాంటి ఢోకా ఉండదని అనుకుంటున్నారు.

కేసీఆర్ స్కెచ్ లానే..

దుబ్బాక ఉపఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో కాకుండా ఈ జిల్లాను ఆనుకుని ఉన్న భువనగిరి యాదాద్రి జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పరోక్షంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఇదే పంథాను బీజేపీ అనుసరించి హుస్నాబాద్‌లో వేదికను ఏర్పాటు చేస్తోంది.

Tags:    

Similar News