బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్‌ను మార్చుతారా..?

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్ సమావేశాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో సభలో బీజేపీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ దృష్టి సారింది. ఇప్పటి వరకు శాసన సభలో బీజేపీ తరపున రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నందున ఆయనే సభా ఫ్లోర్ లీడర్‌గా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవల దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ సభలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. […]

Update: 2021-03-11 13:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్ సమావేశాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో సభలో బీజేపీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ దృష్టి సారింది. ఇప్పటి వరకు శాసన సభలో బీజేపీ తరపున రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నందున ఆయనే సభా ఫ్లోర్ లీడర్‌గా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవల దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ సభలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజా సింగ్ పార్టీ సభా నాయకుడిగా ఉన్నప్పటికీ అసెంబ్లీ సెషన్స్‌లో ఆయన ప్రజా సమస్యలను పెద్దగా లేవనెత్తలేదనే భావన పార్టీ క్యాడర్‌లో నెలకొంది. రాజా సింగ్‌ నార్త్ ఇండియా మూలాలున్న వ్యక్తి కావడం, స్పష్టమైన తెలుగు మాట్లాడలేకపోవడం, దీనికి తోడూ రఘునందన్ రావుతో పోల్చి చూస్తే రాష్ట్ర రాజకీయలు, సామాజిక పరిస్థితులపై అవగాహన తక్కువగా ఉందన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది.

ఫ్లోర్ లీడర్‌ మార్పు తప్పదా..?

అయితే ఇటీవలే దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన రఘుందన్ రావు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుండడం తమకు కలిస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. రాజకీయ,సామాజిక అంశాలపై ఆయనకున్న పట్టువల్ల పార్టీ వాయిస్‌ను బలంగా సభలో వినిపించొచ్చని అనుకుంటోంది. కానీ ఏఏ అంశాలపై చర్చించాలి..? ఫ్లోర్ లీడర్‌ను మార్చితే ఎలా ఉంటుంది..? ప్రభుత్వం తమ సభ్యులకు ఎంత సమయమిస్తుంది..? వంటి వాటిపై రాష్ట్ర నాయకత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్న ఇద్దరు సభ్యుల్లో ఎవరు ఏ అంశాలను మాట్లాడితే బాగుంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజాసింగ్, రఘునందన్‌లకు మార్గనిర్దేశ్యం చేయనున్నట్లు సమాచారం.

సభలో ఏం మాట్లాడాలి అంటే..

భైంసా అల్లర్లు, ప్రాజెక్టుల అవినీతి అంశం, నిరుద్యోగ సమస్య, కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వంటి అంశాలను సభలో ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని అనుకుంటోంది. భైంసా అల్లర్లపై ఆ పార్టీ రియాక్ట్ అయిన తీరుతో ఓ వర్గంలో మరింత మైలేజ్ వచ్చిందనే చర్చ జరుగుతున్నందున ఇదే విషయంపై శాసన సభా వేదికగా సర్కార్‌ను నిలదీస్తే బాగుంటుందనే భావనలో పార్టీ నాయకత్వంలో ఉంది.

ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి..

బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే రఘునందన్ శుక్రవారం రాజాసింగ్‌ను కలవనున్నారు. పార్టీ తరపున అసెంబ్లీ సెషన్స్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఇంతకు ముందు రాజా సింగ్‌కున్న అనుభవాలను షేర్ చేసుకొనున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే.. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే అంశాలపై రఘునందన్‌ రాజాసింగ్‌తో డిస్కషన్స్ చేయనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర సమస్యలతో పాటు రఘునందన్ తన దుబ్బాక నియోజక వర్గ సమస్యలను సభలో ఏకరువు పెట్టే ఆలోచన ఉన్నట్లు టాక్. దుబ్బాక ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల మంజూరు, మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల సమస్యలు సభలో చర్చించాలనే ఆలోచనలో ఉన్నారనే చర్చ జరగుతోంది. అయితే అసెంబ్లీ సెషన్స్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుకొని ఓ స్పష్టతకు వచ్చిన తర్వాత పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News