మరోసారి ఆ జోడికి పరీక్ష.. నిరూపించుకుంటేనే భవిష్యత్

దిశ, స్పోర్ట్స్: 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మిడిల్ ఓవర్ల సమయంలో సరైన స్పిన్నర్ లేక చాలా ఇబ్బంది పడింది. మణికట్టు స్పిన్నర్లు లేని లోటు ఆ సిరీస్‌లో కనపడింది. అదే ఫైనల్‌లో కూడా ప్రభావం చూపించి పాకిస్తాన్‌పై ఓడిపోయేలా చేసింది. దీంతో భారత జట్టులో ఇద్దరు స్పిన్నర్ల ప్రయోగాన్ని సెలెక్టర్లు మొదలు పెట్టారు. అదే ఏడాది భారత జట్టు శ్రీలంకలో ద్వైపాక్షిక సిరీస్ కోసం పర్యటించింది. ఆ జట్టులో యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను […]

Update: 2021-07-14 07:43 GMT

దిశ, స్పోర్ట్స్: 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మిడిల్ ఓవర్ల సమయంలో సరైన స్పిన్నర్ లేక చాలా ఇబ్బంది పడింది. మణికట్టు స్పిన్నర్లు లేని లోటు ఆ సిరీస్‌లో కనపడింది. అదే ఫైనల్‌లో కూడా ప్రభావం చూపించి పాకిస్తాన్‌పై ఓడిపోయేలా చేసింది. దీంతో భారత జట్టులో ఇద్దరు స్పిన్నర్ల ప్రయోగాన్ని సెలెక్టర్లు మొదలు పెట్టారు. అదే ఏడాది భారత జట్టు శ్రీలంకలో ద్వైపాక్షిక సిరీస్ కోసం పర్యటించింది. ఆ జట్టులో యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను తుది జట్టులో ఆడించారు. వీరిద్దరూ మధ్య ఓవర్లలో చాలా ప్రభావం చూపించారు. భారత జట్టు 5 వన్డేల సిరీస్‌ను 5-0తో గెలుచుకున్నది. ఇక అప్పటి నుంచి భారత జట్టులో ఆ స్పిన్ ద్వయం రెగ్యులర్ సభ్యులుగా మారిపోయారు. వారిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కష్టంగా మారిపోయింది.

కష్టకాలంలో విరాట్ కోహ్లీ వారిద్దరిలో ఒకరికి బంతిని అందించి ఫలితాలను రాబట్టాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి 2019 వన్డే వరల్డ్ కప్ మధ్య కాలంలో ఈ ఇద్దరూ భారత జట్టులో కీలక పాత్ర పోషించారు. ప్రతీ మ్యాచ్‌లో ఈ జోడీకి చోటు దక్కింది. జట్టు అవసరాలకు అనుగుణంగా వీరు తమదైన పాత్రను పోషించారు.

అక్కడే విడిపోయారు..

రెండేళ్ల పాటు భారత స్పిన్ జోడి విజయవంతంగా వికెట్లు పడగొట్టింది. ఆ రెండేళ్లలో కుల్దీప్ యాదవ్ 21.74 సగటుతో 87 వికెట్లు, యజువేంద్ర చాహల్ 25.68 సగటుతో 66 వికెట్లు తీశాడు. ఆ సమయంలో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన జోడీగా నిలిచారు. భారత జట్టు బౌలర్లు 32.98 సగటుతో సెకెండ్ పవర్ ప్లేలో చక్కని ప్రదర్శన చేశారు. ఇండియా కంటే ముందు కేవలం ఆఫ్గనిస్తాన్ బౌలర్లు మాత్రమే ఉన్నారు. అలాంటి జోడీకి వరల్డ్ కప్‌లోని న్యూజీలాండ్ మ్యాచ్ పెద్ద షాక్ ఇచ్చింది. గ్రూప్ దశలో ఎడ్జ్‌బాస్టన్ వంటి ఫ్లాట్ పిచ్‌పై ఈ జోడి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వీరిద్దరూ కలసం 20 ఓవర్లు వేసిన 160 పరుగులు ఇచ్చారు. దీంతో వారిద్దరి జోడీకి తర్వాత మ్యాచ్‌ల నుంచి బ్రేక్ పడింది.

చాహల్-యాదవ్ జోడీ కలసి ఆడిన చివరి మ్యాచ్ అదే. ఆ తర్వాత చాహల్ భారత పరిమిత ఓవర్లు జట్టులో రెగ్యులర్‌గా చోటు సంపాదించినా.. యాదవ్ మాత్రం తుది జట్టులో స్థానం కోసం అష్ట కష్టాలు పడాల్సి వస్తున్నది. ప్రతీ పర్యటనకు ఎంపిక అవుతున్నా.. బెంచ్‌కు పరిమతం అవుతూ కుల్దీప్ మానసికంగా కూడా కుంగిపోయాడు. ఇక రెండేళ్ల తర్వాత ఈ జోడి మరోసారి తుది జట్టులో కనిపించనున్నది.

పెద్ద పరీక్ష..

టీమ్ ఇండియా వన్డే జట్టులో రవీంద్ర జడేజా రెగ్యులర్ సభ్యుడిగా మారిన తర్వాత చాహల్-యాదవ్ జోడీ కలసి మ్యాచ్ ఆడే అవకాశాలు రావడం లేదు. ముఖ్యంగా యాదవ్‌కు తుది జట్టులో స్థానం కష్టమవుతున్నది. ఇండియా చివరి సారిగా ఇంగ్లాండ్ జట్టుతో పూణేలో వన్డే సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌కు వీరిద్దరూ ఎంపిక అయినా చాహల్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కుల్దీప్ యాదవ్‌ను రెండో వన్డేలో తీసుకున్నా.. భారీగా పరుగులు ఇవ్వడంతో చివరి వన్డేకు పక్కన పెట్టారు. ఇక టీమ్ ఇండియా ప్రధాన టీమ్ ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుండటంతో మరో సారి ఈ జోడీకి కలసి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు జరుగనున్నాయి.

స్పిన్‌కు అనుకూలమైన ఈ పిచ్‌లో వీరిద్దరూ కలసి ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే తుది జట్టులో చోటు కోసం రాహుల్ చాహర్, క్రిష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి నుంచి వీరికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నది. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా ఆల్‌రౌండర్లు కావడంతో వీరికి తుది జట్టులో ఆ కోటాలో స్థానం కల్పిస్తే యాదవ్, చాహల్‌లలో ఒకరికి చోటు గల్లంతే. కాగా, వీరిద్దరి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే తుది జట్టులో స్థానం దక్కవచ్చు. కొలంబో ట్రాక్‌పై వీరిద్దరు కనుక రాణిస్తే భవిష్యత్‌లో జరిగే మ్యాచ్‌లకు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాబోయే టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌లలో చోటు దక్కించుకోవాలంటే ఈ స్పిన్ జోడీకి శ్రీలంక పర్యటన పెద్ద పరీక్ష అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News