మోడీ, కేసీఆర్‌పై ఫైర్ అయిన భట్టి.. వారిద్దరూ దాని కోసం పోటీ పడుతున్నారంటూ..

దిశ, పాలేరు: ప్రైవేటీకరణ పేరిట దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నడంటూ తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణ చేస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మంగళవారం మధిర మండల కేంద్రంలోని సర్దార్ జమలాపురం కేశవరావు సభాప్రాంగణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ ప్లీనరీ సమావేశానికి […]

Update: 2021-12-28 07:23 GMT

దిశ, పాలేరు: ప్రైవేటీకరణ పేరిట దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నడంటూ తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణ చేస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మంగళవారం మధిర మండల కేంద్రంలోని సర్దార్ జమలాపురం కేశవరావు సభాప్రాంగణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి భట్టి మాట్లాడారు. అనేక త్యాగాలతో కాంగ్రెస్ సృష్టించిన దేశ సంపదను కొల్లగొట్టడంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లు పోటీ పడుతున్నారని దుయ్యబట్టారు.

ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంది అప్పులు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వచ్చే రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరో లక్ష కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలపై ఐదు లక్షల కోట్ల భారాన్ని మోపుతోందన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను దివాళ తీయించిన కేసీఆర్ ప్రజలపై పన్నుల భారం మోపడం కోసం విద్యుత్ చార్జీలు పెంచుతున్నాడని ధ్వజ మెత్తారు. కరెంటు చార్జీలు పెంచిన నాటి చంద్రబాబు నాయుడికి పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు కూడా పడుతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా ఆందోళనలు చేయడానికి జనవరి 9 నుంచి మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యకుండా నిరుద్యోగులను మోసం చేసి, రుణమాఫీ అమలు చేయకుండా రైతులను మోసం చేసి, పావలా వడ్డీ ఇవ్వకుండా మహిళలను మోసం చేసి తెలంగాణను అభివృద్ధి చేశారని టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైన్స్ దుకాణాలను పెంచి.. అభివృద్ధి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామ గ్రామానికి బెల్టు దుకాణాలు విస్తరించడమే తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధని ఎద్దేవా చేశారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు చేసే పనులకు మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాల పేరిట కొబ్బరికాయలు కొట్టడాన్ని అభివృద్ధంటారా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో 35 సంవత్సరాలు దాటిన నిరుద్యోగ యువత 100 రోజుల ఉపాధి పనులకు వెళ్లాల్సిన దుస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ధ్వజమెత్తారు. పెను సవాలుగా మారిన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల రిజర్వేషన్లను నిర్వీర్యం చేయడంలో కుట్రలో భాగంగానే మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పేరిట కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు.

భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం..

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్కూర్ క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున భట్టికి స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, మహిళా కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్కకు మంగళహారతులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్కపై పూలవర్షం కుమ్మరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో కాంగ్రెస్ శ్రేణులకు డిజిటల్ సభ్యత్వ నమోదు, జనవరి 9 నుంచి చేపట్టే పాదయాత్ర, ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ రూపకల్పనపై భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News