దుబ్బాక ఫలితాలు.. మహానగరంలో వారి మకాం

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణలో కీలకమైన దుబ్బాక ఉప‌ ఎన్నికల ఫలితం నేడు తేలనుంది. నువ్వా నేనా అంటూ సాగిన పోరాటంలో గెలుపెవరిది అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక్కో సంస్థ ఒక్కో విధంగా వెల్లడించింది. ఓ సంస్థ అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని.. మరి కొన్ని సంస్థలు బీజేపీ గెలుస్తుందని తేల్చాయి. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా మారనున్న దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ […]

Update: 2020-11-09 23:29 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణలో కీలకమైన దుబ్బాక ఉప‌ ఎన్నికల ఫలితం నేడు తేలనుంది. నువ్వా నేనా అంటూ సాగిన పోరాటంలో గెలుపెవరిది అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక్కో సంస్థ ఒక్కో విధంగా వెల్లడించింది. ఓ సంస్థ అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని.. మరి కొన్ని సంస్థలు బీజేపీ గెలుస్తుందని తేల్చాయి. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా మారనున్న దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ అటు టీఆర్ఎస్‌కు, ఇటు బీజేపీకి ప్రతిష్ఠాత్మకం కావటంతో ఈ స్థానంపై గ్రేటర్ హైదరాబాద్‌లోనూ జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.

నగరంలో తీవ్ర చర్చ
దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుపై హైదరాబాద్‌లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఫలితాలపై లక్షల రూపాయల బెట్టింగ్‌లకు దిగుతున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. రఘునందన్‌రావు (బీజేపీ), చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), రామలింగా‌రెడ్డి భార్య సుజాత (టీఆర్ఎస్) తరపున బరిలో నిలిచారు. ఆయా పార్టీల ముఖ్య నాయకులంతా దుబ్బాక‌లోనే మకాం వేసి సర్వశక్తులూ ఒడ్డారు. అయితే టీఆర్ఎస్, బీజేపీ‌ల మధ్యే టఫ్ ఫైట్ నడిచింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పందెం రాయుళ్ల దందా ఊపందుకుంది. నగరంలోని పలు హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని రిసార్టుల్లో మకాం వేసి కాయ్.. రాజా కాయ్ అంటూ బెట్టింగ్‌లు కడుతున్నారు.

మెజారిటీపైనా బెట్టింగ్..
దుబ్బాక ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు రెండు విధాలుగా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ అభ్యర్థి కనీసం 50 వేల అధిక్యంతో గెలుస్తారంటూ ఆ పార్టీ వర్గీయులు పందాలకు సిద్ధమవుతున్నారు. అధిక్యం అనవసరం, బీజేపీ గెలుపు ఖాయమంటూ కొందరు పందాలు కాస్తున్నారు. శామీర్‌పేట, మేడ్చల్, కీసరతోపాటు నరగరంలోనే కొన్ని హోటళ్లలో మకాం వేసి పందాలు పెట్టినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని మరికొందరు పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరు ఫలానా పార్టీ గెలుస్తోంది.. సదరు అభ్యర్థి గెలుపుపై మీరు రూ.10 వేలు పందెం కాస్తే మీకు రూ.40వేలు ఇస్తామంటూ అశలు రేకెత్తిస్తున్నట్లు సమాచారం. రూ.25 వేలకు నాలుగింతలు రూ.ఒక లక్ష అంటూ పందెం రాయుళ్లు జనాన్ని ముగ్గులోకి దించుతున్నట్లు తెలిసింది. ఇంకొన్ని చోట్ల రౌండ్ రౌండ్‌కు ఏయే అభ్యర్థి ఎంత మెజారిటీ సాధిస్తాడనే విషయంలోనూ బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News