ప్రకృతి అందాలకు ‘ఫిదా’
కరోనా మహమ్మారి.. మనుషుల లైఫ్ స్టైల్‌ను, ఆలోచనా విధానాన్ని అమాంతం మార్చేసింది. ఇన్నాళ్లూ వర్క్ బిజీలో క్షణం తీరికలేకుండా గడుపుతూ, ఏసీ గదుల్లో, కంప్యూటర్ తెరలపై ప్రపంచాన్ని వీక్షించిన వారంతా ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు మొగ్గు చూపుతున్నారు. వీక్ డేస్‌లో బిజీబిజీగా గడిపే సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్‌తో పాటు ఇతర రంగాల్లో పనిచేసేవారు గతంలో వీకెండ్ వచ్చిందంటే చాలు.. సినిమాలు, షికార్లతో రిలీఫ్ పొందేవారు. అందులో భాగంగానే హైదరాబాద్ సిటీ సెంటర్‌తో […]
కరోనా మహమ్మారి.. మనుషుల లైఫ్ స్టైల్‌ను, ఆలోచనా విధానాన్ని అమాంతం మార్చేసింది. ఇన్నాళ్లూ వర్క్ బిజీలో క్షణం తీరికలేకుండా గడుపుతూ, ఏసీ గదుల్లో, కంప్యూటర్ తెరలపై ప్రపంచాన్ని వీక్షించిన వారంతా ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు మొగ్గు చూపుతున్నారు. వీక్ డేస్‌లో బిజీబిజీగా గడిపే సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్‌తో పాటు ఇతర రంగాల్లో పనిచేసేవారు గతంలో వీకెండ్ వచ్చిందంటే చాలు.. సినిమాలు, షికార్లతో రిలీఫ్ పొందేవారు. అందులో భాగంగానే హైదరాబాద్ సిటీ సెంటర్‌తో పాటు నగర శివార్లలో ఏర్పాటైన అమ్యూజ్మెంట్ పార్కులు, థీమ్ పార్కుల్లో సేదతీరేవారు. అయితే కొవిడ్ లాక్డౌన్ నుంచి అంతా గప్ చుప్ అయ్యింది. ఏడికెళ్తే ఏం జరుగుతుందోనన్న భయం జనాలను వెంటాడుతోంది. ఈ క్రమంలో ఇండ్లలోనే ఉండి బోర్ ఫీలవుతున్న చాలామంది రీఫ్రెష్మెంట్ కోసం సిటీకి దూరంగా ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లను ఎంచుకుంటున్నారు.
వైరస్ ఎఫెక్ట్‌తో సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఆఫీసులు కూడా చాలామటుకు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నాయి. మార్చి నుంచి జనాలు బయట తిరగడాన్ని తగ్గించేశారు. ఇంటి దగ్గరే ఉంటూ పనిచేయడం.. వీలైనప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో మూవీస్ చూడటం, గేమ్స్ ఆడటంతోనే రోజు గడిచిపోతోంది. ఇలా ఒకేవిధమైన పని విధానంతో కొందరు మెంటల్ స్ట్రెస్‌కు గురవుతుంటే.. చాలామంది బోర్ ఫీల్ అవుతున్నారు. ఈ స్టీరియోటైపిక్ కండిషన్‌ను బ్రేక్ చేసేందుకే ఇప్పుడు చాలామంది ట్రావెలింగ్‌ను ఎంచుకుంటున్నారు. అట్లాంటివారికి హైదరాబాద్ సిటీకి 75 కిలోమీటర్ల దూరంలోని ‘అనంతగిరి హిల్స్’ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
చాలా రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉండటం బోరింగ్‌గా ఉంది. రీఫ్రెష్ అవుదామనుకుంటే పబ్‌లు, పార్క్‌లు ఓపెన్ కాలేదు. ఎక్కడికెళ్లాలన్నా అందరిలోనూ కరోనా భయమే. అయితే, నేను పనిచేస్తున్న సంస్థ మేనేజ్మెంట్ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కల్పించడం కాస్త ఊరట కలిగించే విషయం. కానీ, ట్రావెలింగ్ అంటే ఇష్టపడే నేను.. ఇన్ని రోజులు ఇంటి నుంచి బయటకెళ్లకుండా ఎట్లా ఉన్నానో నాకే తెలియదు. అయితే, ప్రాణ భయమే.. ఇన్నాళ్లూ ట్రావెలింగ్‌కు వెళ్లకుండా నా మనసుకు కళ్లెం వేసిందనుకుంటా. కానీ, ఈ సారి మాత్రం డేర్ చేసి, బైక్‌పైనే లాంగ్ డ్రైవ్ వెళ్లాలని డిసైడ్ అయ్యా. ఆదివారం నాకు వీక్ ఆఫ్.. అదృష్టం కొద్దీ నా వైఫ్‌కు కూడా అదే రోజు లీవ్ దొరికింది. ఇక టూర్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసే పనిలో పడ్డా. దగ్గర్లో చూడదగ్గ ప్రదేశం ఏముందని ఫోన్లో సెర్చ్ చేస్తే వికారాబాద్ ‘అనంతగిరి హిల్స్’ బెస్ట్ ఆప్షన్‌గా అనిపించింది.
ఆదివారం ఉదయం 9.30 గంటలు..
టూర్‌కు అంతా సిద్ధం. జర్నీలో తినేందుకు కొద్దిపాటి స్నాక్స్‌ను బ్యాగులో వేసుకొని నా స్పోర్ట్స్ బైక్‌పై బయలుదేరాం. బండ్లగూడ జాగీర్ సన్‌సిటీ నుంచి హైవేపై బైక్ రయ్యిన దూసుకెళ్తోంది. చాలా రోజుల తర్వాత టూర్‌కు వెళ్తుండటంతో మనసులో ఏవేవో భావాలు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంటే, అలా.. మొబైల్‌లో లొకేషన్ అప్డేట్ చూసుకుంటూ మాగ్జిమమ్ 70 టు 85 స్పీడ్‌తో చేవెళ్ల మీదుగా వికారాబాద్ చేరుకున్నాం.
దారిపొడవునా పచ్చదనమే..
మేం వెళ్లే దారిలో చేవెళ్ల – వికారాబాద్ మధ్యన రోడ్డుకు ఇరువైపులా కనుచూపు మేర మొత్తం పచ్చని పొలాలు ఆహ్లాదన్నిస్తూ.. మాలో మరింత పాజిటివిటీని పెంచాయి. ప్రధానంగా ఆ ఏరియాలో ఎక్కువగా క్యారెట్ పంటను సాగు చేయడం కనిపించింది. వీటితో పాటు చిక్కుడు, బెండ, క్యాబేజీ వంటి కూరగాయ పంటలు, గులాబీ తోటలు కూడా కనిపించాయి.
చూడముచ్చటగా..
పంట పొలాలను చూస్తూ సాగిన మా జర్నీలో ఎక్కడా నెర్వస్‌గా ఫీల్ అవలేదు. పచ్చని పొలాలు, కూరగాయల తోటలు.. అక్కడక్కడా రోడ్డు పక్కన పండ్లు అమ్ముతూ పల్లెజనాలు తారసపడ్డారు. పచ్చని పంట పొలాల మధ్య స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ లాంగ్ డ్రైవ్ వెళ్లడం మనసును తేలికపరిచింది. ఏదో తెలియని బరువును దించుకున్న ఫీలింగ్ కలిగింది.
అనంతగిరిలో..
అనంతగిరి చేరగానే ముందుగా కనిపించేది అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ ఆలయం దాదాపు 400 ఏళ్ల క్రితం నిజాం నవాబులు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. కొవిడ్ రూల్స్ పాటిస్తూనే చాలా మంది అక్కడ స్వామివారిని దర్శించుకోవడం కనిపించింది.
హిల్స్ వ్యూ పాయింట్..
ఎత్తైన కొండపై నుంచి కిందకు చూసే వీలుండే ఈ ప్లేస్‌ను హిల్స్ వ్యూ పాయింట్ అంటారు. గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేసి కూడా ఆ వివరాలు తెలుసుకోవచ్చు. హిల్స్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే అనంతగిరి అటవీ ప్రాంతం 360 డిగ్రీస్‌లో కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కిందకు వెళ్లకూడదు. పోలీసుల పర్మిషన్ లేకుండా అటువైపు వెళ్లనీయరు కూడా. పర్మిషన్ తీసుకుని వెళ్లిన కొంతమంది అక్కడుండే చెట్లకింద సేదతీరుతూ కనిపించారు. కార్లు, బైక్‌లపై వచ్చిన వాళ్లు రెస్ట్ తీసుకుంటూ.. చుట్టూ ఉండే గుట్టలు, చెట్లతో కూడిన అటవీ ప్రాంతంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ.. చిన్న చిన్న పార్టీల్లో మునిగితేలడం కనిపించింది.
చిట్టడవి..
తాండూరుకు వెళ్లే రూట్లో చిట్టడవి ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలన్నా పోలీసుల పర్మిషన్ కంపల్సరీ. వర్షాకాలంలో ఈ ఏరియాలో గ్రీనరీ మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడక్కడా పచ్చికబయళ్లలో గుంపులుగా సంచరించే నెమళ్లు, గెంతుతూ తిరిగే కుందేళ్లను చూస్తూ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
రియల్ ఫారెస్ట్..
రూల్స్ కఠినంగా ఉన్నా రియల్ ఫారెస్ట్‌ను చూడాలనే ఆలోచనతో చాలా మంది ట్రావెలర్స్ థిక్ ఫారెస్ట్ లోపలికి వెళ్లే సాహసం చేస్తుంటారు. కొంచెం భయం వేసినా.. ఇది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కరోనా మహమ్మారితో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని వాళ్లు.. కాస్త వీలు చేసుకుని అనంతగిరి హిల్స్ వెళ్తే అటవీ అందాలను చూస్తూ రిలీఫ్ పొందవచ్చు.
ఆ రూట్లో జాగ్రత్త..
హైదరాబాద్ నుంచి అనంతగిరి వెళ్లాలనుకునే ట్రావెలర్స్‌లో కొంతమంది చిలుకూరు బాలాజీని దర్శించుకుని వెళ్తుంటారు. బాలాజీ టెంపుల్ నుంచి చిల్కూరు విలేజ్ మీదుగా ఉన్న దారిలో కూడా వికారాబాద్ వెళ్లొచ్చు. ఈ రూట్ కొంత దూరం బాగున్నప్పటికీ కిలోమీటర్ కూడా వెళ్లకముందే రోడ్డు మధ్యకు తెగిపోయి డ్యామేజ్ అయ్యింది. ఇలా దారి పొడవునా రోడ్ అక్కడక్కడా తెగిపోయి ఉండటంతో స్పీడ్‌గా వెళ్లే బైకర్స్ కానీ, కార్లు గానీ యాక్సిడెంట్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.