యాదాద్రిలో వెల్లివెరిసిన శిల్పాకళా వైభవం..
దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దే క్రమంలో సాంప్రదాయ, ఆధ్యాత్మిక హంగుల ఏర్పాట్లకు యాడా మరో యత్నం చేస్తోంది. ఆధ్యాత్మికంగా ఆకర్షించే పలు విగ్రహాలతో పాటు రాజసం, మహాదర్పం ఉట్టిపడే ,ప్రతిమలను ఏర్పర్చిచేందుకు మహాబలి పురం నుంచి,సదరు విగ్రహాలను రప్పించారు. మహారాజసం కలిగించే రాతి బొమ్మల అమరికకు చేపట్టిన కసరత్తులో భాగంగా ఆ విగ్రహాలను మహాబలిపురం నుంచి ఇటీవల తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఐరావతం, సింహాల విగ్రహాలు పొందుపరిచారు. వాటిని నలుదిశలా […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దే క్రమంలో సాంప్రదాయ, ఆధ్యాత్మిక హంగుల ఏర్పాట్లకు యాడా మరో యత్నం చేస్తోంది. ఆధ్యాత్మికంగా ఆకర్షించే పలు విగ్రహాలతో పాటు రాజసం, మహాదర్పం ఉట్టిపడే ,ప్రతిమలను ఏర్పర్చిచేందుకు మహాబలి పురం నుంచి,సదరు విగ్రహాలను రప్పించారు. మహారాజసం కలిగించే రాతి బొమ్మల అమరికకు చేపట్టిన కసరత్తులో భాగంగా ఆ విగ్రహాలను మహాబలిపురం నుంచి ఇటీవల తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఐరావతం, సింహాల విగ్రహాలు పొందుపరిచారు. వాటిని నలుదిశలా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మరిన్ని శిల్పాలను తీసుకొచ్చారు. ఆ శిల్పాలను ఆలయ మహా ముఖమండపం, రాజగోపురాల చెంత అమర్చేందుకు పనులు చేస్తున్నారు.
ఏ శిల్పం ఎక్కడ అంటే..
యాదాద్రి ప్రవేశ మార్గంలోని త్రితల రాజగోపురం ఎదుట, క్షేత్ర పాలకుడి మందిరం నుంచి ముఖ మండపంలోకి వెళ్లే మెట్ల మార్గంలో సింహరూపాలు పొందుపర్చనున్నారు. ఐరావతం విగ్రహాలను దక్షిణ, ఉత్తర దిశల్లోని రాజగోపురాల ఎదుట ఏర్పాటు చేయనున్నారు. ఆలయ ఉత్తర దిశలోని ప్రహరీకి ఆధ్యాత్మిక చిహ్నాలైన శ్రీశంఖు, చక్ర నామాల శిలారూపాలను అమర్చనున్నారు. యాదాద్రి అనుబంధ పర్వతవర్ధని రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివాలయం ఎదుట ఐదు అడుగుల భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆలయం నలువైపులా నిర్మించిన సాలహారాలలో శ్రీకృష్ణ మహాత్యాన్ని చాటే విగ్రహాల ఏర్పాట్లపై శిల్పి ఆనందసాయి రూపొందించిన నమూనాలను జీయర్‌స్వామి ఈ నెల 7న తిలకించిన సంగతి తెలిసిందే. అష్టలక్ష్మీలు, దిక్పాలకుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు యాడా అధికార వర్గాల సమాచారం. ఆ మేరకు యాడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహాబలిపురం నుంచి 20 శిల్పాలు..
యాదాద్రిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్న శిల్పాలు మహాబలిపురం నుంచి యాదాద్రికి చేరుకున్నాయి. కృష్ణశిలతో రూపొందించిన 20 కళాఖండాలను ఆలయ ప్రాంగణానికి చేర్చారు. ఇవేకాకుండా భక్తితత్వాన్ని పెంపొందించే విధంగా, ఆలయ సన్నిధిలో అష్టలక్ష్మి, అష్టదిక్పాలకులు, నారసింహ రూపాలు, దశావతారాల విగ్రహాలనూ పెట్టాలని జీయర్ స్వామి సూచనలు చేశారు.
సర్వాంగ సుందరంగా పంచ మండపాలు..
ప్రత్యేక శైలిలో కృష్ణశిలతో నిర్మిస్తున్న కట్టడాలు కనువిందు చేస్తున్నాయి. వైష్ణవ ఆచారాల ప్రకారం ఆగమ శాస్త్రం అనుసరిస్తూ.. నిర్మాణాలు చేపడుతున్నారు. ఆలయంలో పలు కైంకర్యాలకు పంచ నారసింహులకు పంచ మండపాలు సకల హంగులతో రూపొందిస్తున్నారు. పంచ నరసింహుల స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతున్న యాదాద్రిలో ఆలయానికి తూర్పు దిశలో వార్షికోత్సవాల నిర్వహణకు ఒక మండపం, బ్రహ్మోత్సవాల నిర్వహణకు దక్షిణ దిశలో, మహరాజ గోపురం ఎదుట నిత్య సేవోత్సవంలో స్వామి వారు సేదతీరే.. వేంచేపు మండపం, ఆలయ పుష్కరిణిలో ఉత్సవాలు నిర్వహించే మండపాలు పూర్తయ్యాయి. కాగా.. ఐదో మండపమైన నిత్య కల్యాణ మండపం నిర్మాణంలో ఉంది. భక్తుల మనో ఉల్లాసానికి అష్టభుజ మండలం తొలి ప్రాకారంలో అద్దాల మండలం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నరసింహుడికి బంగారు ఉయ్యాల..
నారసింహుని సన్నిధికి మరిన్ని హంగులు అద్దుతున్నారు ఆలయ అధికారులు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి బంగారు ఊయల సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఆలయ గర్భగుడిపై కృష్ణశిలతో నిర్మితమైన దివ్య విమాన గోపురాన్ని స్వర్ణమయంగా మార్చే క్రతువులో భక్తులను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే యాడా వర్గాలు భక్తుల నుంచి బంగారం సేకరణ యోచన చేస్తున్నాయి.
రెండ్రోజులుగా బోసిపోయిన యాదాద్రి..
కరోనా విజృంభిస్తున్న కారణంగా దేవాదాయ శాఖ ఆదేశాలతో నేటి నుంచి మూడు రోజులు పాటు ఆలయంలో భక్తుల దర్శనాలను అధికారులు రద్దు చేశారు. కొండ మీద కింద వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా మూత పడ్డాయి. దీనితో యాదాద్రి పరిసరాలు బోసిపోయి కనిపించాయి. నిత్యం వేలాది భక్తజనంతో, నిత్యకల్యాణం పచ్చతోరణంలా కళకళలాడే యాదాద్రి భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. శ్రీ స్వామి వారి నిత్య కైకర్యములు, ఆన్ లైన్ సేవలు, ఏకాంత సేవలను భక్తులు లేకుండా అర్చకులు యధావిధిగా నిర్వహిస్తున్నారు.