రాత్రి తల్లిని హత్య చేసి.. ఉదయం లేచి హైడ్రామా.. చివరికి ట్విస్ట్..
దిశ, నర్సాపూర్: జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిని మానవత్వం మరచి నిర్దాక్షిణ్యంగా కట్టెలతో కొట్టి చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మంగపూర్ గ్రామానికి చెందిన కొండని ఎల్లమ్మ (65), ఎల్లయ్య దంపతులకు సంతానం లేరు. దీంతో హత్నూరకు చెందిన బంధువుల ఇంటి నుంచి 18 ఏళ్ల క్రితం […]
దిశ, నర్సాపూర్: జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిని మానవత్వం మరచి నిర్దాక్షిణ్యంగా కట్టెలతో కొట్టి చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మంగపూర్ గ్రామానికి చెందిన కొండని ఎల్లమ్మ (65), ఎల్లయ్య దంపతులకు సంతానం లేరు. దీంతో హత్నూరకు చెందిన బంధువుల ఇంటి నుంచి 18 ఏళ్ల క్రితం ఓ పిల్లాడిని వీరు దత్తత తీసుకున్నారు. పదేళ్లక్రితం ఎల్లయ్య అనారోగ్యంతో చనిపోయాడు.
అప్పటి నుంచి ఎల్లమ్మ ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా మహేందర్ ను పెంచింది. అయితే ఇటీవల తనకున్న వ్యవసాయ భూమిలో 17 గుంటల భూమిని ఎల్లమ్మ విక్రయించింది. పొలం అమ్మిన తాలూకు డబ్బులు ఇవ్వాలని మహేందర్ గత కొన్ని రోజులుగా తల్లిని వేధిస్తూ వచ్చాడు. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు మహేందర్‌కు ఎల్లమ్మ డబ్బులు ఇవ్వలేదు. దాంతో మంగళవారం రాత్రి తల్లితో గొడవ పడిన మహేందర్ పెంచిన తల్లి ఎల్లమ్మను విచక్షణ లేకుండా కట్టెలతో తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది.
అరుపులు వినపడకుండా సౌండు పెంచి
మహేందర్ ముందస్తు ప్లాన్ ప్రకారం ఎల్లమ్మను చంపాలని నిర్ణయించుకున్నాడు. అరుపులు బయటకు వినపడకుండా ఇంట్లో సౌండ్ బాక్సుల్లో దబ్దం ఎక్కువగా పెట్టి పెంచిన తల్లి ఎల్లమ్మను పైశాచికంగా కడతేర్చాడు. బుధవారం నాడు ఉదయం ఏమి ఎరగనట్టు స్నానం చేసి బయటకు వచ్చి పడుకున్న తన తల్లి పిలిచిన లేవట్లేదని హైడ్రామా మొదలెట్టాడు. చుట్టుపక్కల వారు అనుమానం వచ్చి మహేందర్ కు దేహశుద్ది చేయడంతో అసలు విషయం బయట పెట్టాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.