ఈ సారి కూడా వారు లేకుండానే ఐపీఎల్
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్‌లలో మొదటి స్థానం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌దే. బీసీసీఐ నిర్వహించే ఈ క్యాష్ రిచ్ లీగ్ కరోనా కాలంలో కూడా ఆగలేదు. గత సీజన్ 6 నెలల ఆలస్యంగా విదేశీ గడ్డపై ఖాళీ స్టేడియంలలో నిర్వహించినా.. అభిమానులకు ఆనందాన్ని, బీసీసీఐకి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. 13 సీజన్ ముగిసిన 5 నెలల్లోనే 14వ సీజన్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ ఇండియాలో ఉధృతంగా మారింది. దీంతో […]
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్‌లలో మొదటి స్థానం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌దే. బీసీసీఐ నిర్వహించే ఈ క్యాష్ రిచ్ లీగ్ కరోనా కాలంలో కూడా ఆగలేదు. గత సీజన్ 6 నెలల ఆలస్యంగా విదేశీ గడ్డపై ఖాళీ స్టేడియంలలో నిర్వహించినా.. అభిమానులకు ఆనందాన్ని, బీసీసీఐకి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. 13 సీజన్ ముగిసిన 5 నెలల్లోనే 14వ సీజన్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ ఇండియాలో ఉధృతంగా మారింది.
దీంతో మరోసారి ఖాళీ స్టేడియంలలో బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్దం చేసింది. దేశంలోని ఆరు వేదికల్లో ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీ)ను బీసీసీఐ రూపొందించింది. ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగమైన క్రికెటర్లు, మేనేజ్‌మెంట్, మ్యాచ్ అఫీషియల్స్, గ్రౌండ్ స్టాఫ్, బ్రాడ్‌కాస్టింగ్ స్టాఫ్, బోర్డు అధికారులు అందరూ తప్పకుండా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
12 బయోబబుల్స్..
ఐపీఎల్ 14వ సిరీస్ కోసం బీసీసీఐ 12 బయోబబుల్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ ‘క్రిక్‌బజ్’ ఒక కథనం ప్రచురించింది. వీటిలో 8 బయోబబుల్స్ ఫ్రాంచైజీల కోసం.. రెండు బబుల్స్ మ్యాచ్ అఫీషియల్స్, మేనేజ్‌మెంట్ కోసం.. మరో రెండు బబుల్స్ బ్రాడ్‌కాస్టర్స్, కామెంటేటర్ల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రతీ ఫ్రాంచైజీ తమకు కేటాయించిన బయోబబుల్‌లో ఆటగాళ్లతో పాటు, టీమ్ మేనేజ్‌మెంట్, కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్‌ను కూడా ఉంచాలి. ఇక రిఫరీ, అంపైర్లు, మ్యాచ్‌కు సంబంధించిన ఇతర అధికారులు అందరూ రెండు బయోబబుల్స్‌లో ఉంటారు.
ఇక బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బంది, కామెంటేటర్లు మరో రెండు బయోబబుల్స్‌లో ఉంటారు. అయితే బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు ఏ బయోబబుల్‌లో ఉండరని బోర్డు తెలిపింది. అంతే కాకుండా లీగ్ జరుగుతున్నన్ని రోజులు బీసీసీఐకి చెందిన ఏ ఒక్క అధికారి కూడా ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్‌తో నేరుగా మాట్లాడరని స్పష్టం చేసింది. బయోబబుల్‌లోకి ప్రవేశించే ప్రతీ ఒక్కరు ముందుగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఫ్రాంచైజీ ఓనర్లు అయినా బయోబబుల్‌లోకి ప్రవేశించాలంటే ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరని చెప్పింది. ప్రతీ బయోబబుల్‌కు నలుగురు సెక్యూరిటీ స్టాఫ్‌ను బీసీసీఐ నియమించనున్నది. ఎవరైనా బయోప్రోటోకాల్స్ ఉల్లంఘించినట్లు తెలిస్తే ఈ సెక్యూరిటీ స్టాఫ్ వెంటనే బీసీసీఐకి రిపోర్టు చేయనుంది. బయోబబుల్‌లో ఉండే ప్రతీ ఒక్కరికి బీసీసీఐ ఒక ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్ అందించనున్నది. 24 గంటలు వీటిని ధరించాల్సి ఉంటుంది. ఎవరైనా వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయితే.. ఈ రిస్ట్ బ్యాండ్ ద్వారా వారికి సన్నిహితంగా ఉన్న వారిని కూడా గుర్తించే వీలుంది.
వీరికి ఊరట..
ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడుతున్న ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ బయోబబుల్‌లోనికి చేరడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ ఆటగాళ్లు బయోబబుల్‌లోనే ఉన్నందున.. వీరికి ఎలాంటి క్వారంటైన్ అవసరం లేదని బీసీసీఐ చెప్పింది. ఈ ఆటగాళ్లు బంధువులు, కుటుంబ సభ్యులను కలవడానికి వీళ్లేదని బీసీసీఐ స్పస్టం చేసింది. అయితే ఎవరైనా ఆటగాడు ఇంటికి వెళ్లాలని భావిస్తే… ఫ్రాంచైజీ బయోబబుల్‌లో చేరడానికి తప్పకుండా 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని బోర్డు చెప్పింది. మరోవైపు సౌత్ఆఫ్రికా, పాకిస్తాన్ సిరీస్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లు చార్టెడ్ ఫ్లైట్‌లో వస్తే.. వారికి కూడా క్వారంటైన్ అవసరం లేదని బోర్డు చెప్పింది. ఐపీఎల్‌లో పాల్గొంటున్న వారికి వ్యాక్సినేషన్ చేయడం లేదు. ప్రస్తుతం ఇండియాలో 45 నుంచి 59 ఏళ్ల వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తున్నందున.. క్రికెటర్లకు వ్యాక్సినేషన్ చేసే అవకాశం లేదని బీసీసీఐ చెప్పింది. క్రికెట్ బంతుల విషయంలో ఐసీసీ నిబంధనలు పాటిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.
మొదటి లెగ్ మ్యాచ్‌లకు ఇవీ నిబంధనలు..
ఐపీఎల్‌లో మొదటి లెగ్ మ్యాచ్‌లు ముంబయి, చెన్నై వేదికల్లో నిర్వహించనున్నారు. యూకే, మధ్యప్రాచ్యం, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, యూరోప్ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు తప్పకుండా ముంబయిలో 7 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. వీరి సొంత ఖర్చుల మీదే క్వారంటైన్‌లో ఉండాలని బోర్డు చెప్పింది. ఇక ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి ముంబయికి వచ్చే వారికి మాత్రం క్వారంటైన్ అవసరం ఉండదు. దీని ప్రకారం విదేశీయులు మొత్తం 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి. స్వదేశీయులకు మాత్రం 7 రోజుల క్వారంటైన్ ఉంటుంది. ఇక చెన్నైకి వచ్చే ప్రతీ భారతీయుడు, విదేశీయుడు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈ-పాస్ తీసుకోవాలి ఉంటుంది. వీరికి ప్రభుత్వ క్వారంటైన్ ఏమీ ఉండదు. కానీ బీసీసీఐ క్వారంటైన్ 7 రోజుల పాటు ఉంటుంది.