ఇండియాలోనే టీ20 వరల్డ్ కప్.. అప్పుడే ప్రకటన!

దిశ, స్పోర్ట్స్: కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో ఐపీఎల్ 2021ని మొదలు పెట్టి ఆ తర్వాత అర్ధాంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పుడే ఇండియాలో నిర్వహించాల్సిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఇండియాలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే మా వద్ద ప్లాన్ ‘బి’ ఉందంటూ ఐసీసీ కూడా వ్యాఖ్యానించింది. ఆ తర్వాత బీసీసీఐ కూడా కరోనా కేసులు పెరిగి.. పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటే టీ20 వరల్డ్ కప్‌ను […]

Update: 2021-05-19 07:50 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో ఐపీఎల్ 2021ని మొదలు పెట్టి ఆ తర్వాత అర్ధాంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పుడే ఇండియాలో నిర్వహించాల్సిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఇండియాలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే మా వద్ద ప్లాన్ ‘బి’ ఉందంటూ ఐసీసీ కూడా వ్యాఖ్యానించింది. ఆ తర్వాత బీసీసీఐ కూడా కరోనా కేసులు పెరిగి.. పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటే టీ20 వరల్డ్ కప్‌ను తటస్థ వేదికకు తరలించడానికి కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పింది. అయితే తాజాగా ఇండియాలోనే టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో సంప్రదింపులు కూడా జరిపింది. ఈ నెల 29న బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం (స్పెషల్ జనరల్ మీటింగ్) నిర్వహించనున్నది. ఆ సమావేశంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణే ప్రధాన అజెండాగా ఉండబోతున్నదని బీసీసీఐ వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపాయి. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో నిర్వహించాల్సిన పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు ఎలాంటి అడ్డంకులు ఏర్పడుతాయి.. వాటిని ఎలా అధిగమించవచ్చు అనే విషయంపై కీలక చర్చ జరుగనున్నది.

29 సమావేశం కీలకం..

బీసీసీఐ ఎస్జీఎం ఈ నెల 29న వర్చువల్ పద్దతిలో నిర్వహించనున్నారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో పాటు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. దేశంలో కోవిడ్-19 తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇండియాలో ఐసీసీ టీ20 నిర్వహించడం సబబేనా.. ఒక వేళ నిర్వహిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు ఆయా రాష్ట్రాల అసోసియేషన్లు సిద్దంగా ఉన్నాయా అనే విషయాలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తున్నది. జూన్ 1న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక సమావేశం నిర్వహించనున్నది. ఆ సమావేశంలో టీ20 వరల్డ్ కప్ అంశమే ప్రధానంగా ఉన్నది. ఇండియాలో కరోనా కారణంగా ఐపీఎల్ కూడా వాయిదా పడిన నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌కు కూడా ఆటంకాలు ఏర్పడతాయా అనే విషయంపై ప్రధాన చర్చ జరుగనున్నది. ఇండియాలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉన్నందున ఆయా నగరాల్లో ఉన్న వేదికల వద్ద రవాణా, ఇతర సౌకర్యాలు సరైన సమయంలో అందుబాటులో ఉంటాయా అనే విషయాన్ని కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల ప్రతినిధుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మే 29న ఎస్జీఎం తర్వాత ఒక కీలక నివేదికను ఐసీసీకి సమర్పించనున్నది.

9 నగరాలు ఎంపిక..

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం దేశంలోని తొమ్మిది నగరాల్లోని స్టేడియంలను బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, న్యూఢిల్లీ, ధర్మశాల, లక్నో నగరాల్లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల అసోసియేషన్లకు వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం సంసిద్దంగా ఉండాలని బీసీసీఐ సమాచారం అందించింది. స్టేడియంకు దగ్గర అందుబాటులో ఉండే స్టార్ హోటల్స్, ఇతర లాజిస్టిక్స్ సంబంధింత వ్యవహారాలను ముందుగానే చక్కబెట్టుకోవాలని సూచించింది. స్పెషల్ జనరల్ మీటింగ్‌లో ఆయా వివరాలను అందించాలని.. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని బీసీసీఐ కోరింది. మరోవైపు బీసీసీఐ ఎంపిక చేసిన నగరాల్లో కోవిడ్ తీవ్రత ఎలా ఉన్నది? అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయా అనే దానిపై కూడా చర్చ జరుగనున్నది. ప్రస్తుతానికైతే వరల్డ్ కప్‌ను ఇండియా నుంచి తరలించకుండా సాధ్యమైనంతగా ఇక్కడే నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. మరి అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

Tags:    

Similar News