ఎన్ఆర్‌సీ డేటా గాయబ్ : మెయిల్ ట్యాంపరింగ్?
అసోం ఎన్ఆర్‌సీ డేటా అధికారిక వెబ్‌సైట్‌లలో మాయం కావడం కలకలాన్ని సృష్టించింది. మొదటి నుంచీ వివాదాలు, ఆరోపణలు, దేశ భద్రత వంటి సున్నితాంశాల నడుమ సాగిన ఈ ఎన్ఆర్‌సీ ప్రక్రియ ద్వారా సేకరించిన సమాచారం గాయబ్ కావడంపై ఆందోళనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వివరాలు, ఈ-మెయిళ్ల ఉద్దేశపూర్వక తొలగింపుపై స్వతంత్ర దర్యాప్తును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసోం ఎన్ఆర్‌సీ అధికారులు కోరనున్నట్టు తెలిసింది. గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ […]
అసోం ఎన్ఆర్‌సీ డేటా అధికారిక వెబ్‌సైట్‌లలో మాయం కావడం కలకలాన్ని సృష్టించింది. మొదటి నుంచీ వివాదాలు, ఆరోపణలు, దేశ భద్రత వంటి సున్నితాంశాల నడుమ సాగిన ఈ ఎన్ఆర్‌సీ ప్రక్రియ ద్వారా సేకరించిన సమాచారం గాయబ్ కావడంపై ఆందోళనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వివరాలు, ఈ-మెయిళ్ల ఉద్దేశపూర్వక తొలగింపుపై స్వతంత్ర దర్యాప్తును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసోం ఎన్ఆర్‌సీ అధికారులు కోరనున్నట్టు తెలిసింది.
గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొన్ని ఈ-మెయిళ్లు డిలీట్ అయినట్టు ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కాలంలోనే రాష్ట్ర ఎన్ఆర్‌సీ కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలా బదిలీపై వెళ్లగా.. హితేష్ దేవ్ శర్మ బాధ్యతలు తీసుకున్నారని గుర్తుచేశారు. దర్యాప్తుకు సంబంధించి అసోం ఎన్ఆర్‌సీ డైరెక్టరేట్.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు తెలిసింది. అలాగే, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రానికి అభ్యర్థనను పంపనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కొన్ని కీలక మెయిళ్ల పాస్‌వర్డులు అందుబాటులో లేకపోవడం వల్ల ఎన్ఆర్‌సీ డేటా సెక్యూరిటీని చెక్ చేయలేకపోతున్నామని ఎన్ఆర్‌సీ అధికారులు తెలిపారు. ఎన్ఆర్‌సీ ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేసిన అజుపి బరుహ గతేడాది నవంబర్‌లో రాజీనామా చేసి వెళ్లారని, కానీ కొన్ని కీలకమైన అధికారిక ఈ-మెయిళ్ల పాస్‌వర్డులు షేర్ చేయలేదని ఎన్ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన మహంతా తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
కాగా, ఎన్ఆర్‌సీ వివరాలు భద్రంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న విప్రో టెక్ కంపెనీతో చెల్లింపులకు సంబంధించిన సమస్యలతో ఈ సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదని అసోం మంత్రి హిమంత బిస్వాశర్మ తెలిపారు. ఎన్ఆర్‌సీ తుది జాబితాలో లోపాలున్నాయని, మరోసారి సమీక్షించుకోవాలని అసోంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ వాదిస్తూ రావడం గమనార్హం.
అధికారికి వెబ్‌సైట్‌లలో ఈ సమాచారం కనిపించట్లేదని తొలుత మీడియాలో కథనాలు రావడంతో అధికారులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం చేసిన ప్రకటనలు మరోసారి చర్చకు వచ్చాయి. ప్రక్రియ ఆసాంతం ఉద్రిక్తంగా సాగగా.. సేకరించిన సమాచారంపైనా ఇప్పుడు నీలినీడలు కమ్ముకోవడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్నది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్‌సీను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ముందుకు రావడంతో మరికొన్ని రాష్ట్రాలూ ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా గళమెత్తనున్నాయా? అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.