చైనాను నమ్మలేం.. అందుకే సరిహద్దులో గట్టి నిఘా
న్యూఢిల్లీ: భారత్, చైనాల బలగాలు సరిహద్దు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాయి. గాల్వాన్ లోయ నుంచి మూడు కిలోమీటర్ల దూరాన్ని పాటించాలని, అందుకనుగుణంగా బఫర్ జోన్లు ఏర్పాటు చేసుకోవాలని ఇరుదేశాలూ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఆర్మీ తాత్కాలిక నిర్మాణాలు కూల్చివేసి, టెంట్లు తీసేసి వెనక్కి వెళ్లింది కానీ, భారీ ఆయుధాలు కలిగిన వాహనాలు గాల్వాన్‌లో లోతైన ప్రాంతాల్లో ఇంకా అలాగే ఉన్నాయి. ఈ ఉపసంహరణ మిలిటరీ చర్చల్లో కుదిరిన […]
న్యూఢిల్లీ: భారత్, చైనాల బలగాలు సరిహద్దు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాయి. గాల్వాన్ లోయ నుంచి మూడు కిలోమీటర్ల దూరాన్ని పాటించాలని, అందుకనుగుణంగా బఫర్ జోన్లు ఏర్పాటు చేసుకోవాలని ఇరుదేశాలూ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఆర్మీ తాత్కాలిక నిర్మాణాలు కూల్చివేసి, టెంట్లు తీసేసి వెనక్కి వెళ్లింది కానీ, భారీ ఆయుధాలు కలిగిన వాహనాలు గాల్వాన్‌లో లోతైన ప్రాంతాల్లో ఇంకా అలాగే ఉన్నాయి. ఈ ఉపసంహరణ మిలిటరీ చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం జరుగుతున్నప్పటికీ ఇన్నాళ్లు చైనా అనుసరించిన ద్వంద్వ నీతి కారణంగా సరిహద్దు పరిస్థితులపై భారత బలగాలు గట్టి నిఘా పెడుతున్నాయి. భారత వైమానిక దళం రాత్రిపూట కూడా గస్తీ కాస్తున్నది. మిగ్-29, సుఖోయ్ 30 ఎంకేఐ, అపాచ్ హెలికాప్టర్, చినూక్ హెలికాప్టర్లూ ఈ గస్తీలో పాల్గొంటున్నాయి. భారత వైమానిక దళం సుశిక్షితమై ఉన్నదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతతో ఎటువంటి వాతావరణంలోనైనా రాత్రిపూట కూడా ఆపరేషన్స్ నిర్వహించే సామర్థ్యం ఎయిర్‌ఫోర్స్‌కు ఉన్నదని సీనియర్ ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ ఎ రాఠి వెల్లడించారు. ఇదిలా ఉండగా, బార్డర్‌లో జరుగుతున్న రోడ్ల నిర్మాణాల స్థితిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎల్ఏసీ, ఎల్‌వోసీలలో రోడ్ల నిర్మాణ ప్రాజెక్టుల పనితీరు ఎలా సాగుతున్నదో అధికారులు మంత్రికి వివరించారు. లడాఖ్‌లో సుమారు రూ.20వేల కోట్ల విలువైన రోడ్ల ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచనలు చేశారు.
కొత్త క్యాంపులను పరిశీలించాలి
బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత పెట్రోలింగ్ పాయింట్ 14వరకు మళ్లీ గస్తీ నిర్వహిస్తామని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఎల్ఏసీలో పరిశీలనలన్నీ పూర్తయిన తర్వాత పెట్రోలింగ్ చేస్తామని తెలిపాయి. మిలిటరీ చర్చల్లో కుదరిన ఒప్పందం ప్రకారం, వెనక్కి మళ్లిన బలగాలు ఎక్కడ ఆగాయో, కొత్త క్యాంపులు ఎక్కడ పెట్టాయో రెండు దేశాల సైన్యం సంయుక్తంగా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సమస్యాత్మక భూభాగం ఎవరి స్వాధీనంలో లేదని ధ్రువీకరించుకుని పరస్పరం విశ్వాసాన్ని పెంచుకోవడానికి కృషి చేసుకోవాలి. కాగా, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఇరుదేశాల మధ్య చర్చలు సాగుతాయని ఓ మిలిటరీ అధికారి తెలిపారు. ఒప్పందం ప్రకారం ఈ నెల 5వ తేదీలోపు ఈ ప్రక్రియ ముగిసిపోవాలి. కానీ, అనుకున్నట్టుగా క్షేత్రస్థాయి పరిస్థితులు లేకున్నా సానుకూలంగా సాగుతున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. బలగాల ఉపసంహరణకు ఇంకొన్ని రోజులు పట్టొచ్చని అభిప్రాయపడ్డాయి. గాల్వాన్‌తోపాటు ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా మారిన హాట్‌స్ప్రింగ్స్, గోగ్రాల నుంచీ చైనా సైన్యం తోకముడించిదని వివరించాయి.
వేగం పెంచండి: రాజ్‌నాథ్ సింగ్
సరిహద్దు ఉద్రిక్తతలు సమసిపోవడానికి సుదీర్ఘ సమయం పడుతుందని కొందరు అధికారులు భావిస్తున్నారు. కాబట్టి స్వల్పకాలంలోనే కీలకమైన రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. లడాఖ్ రీజియన్‌లో రోడ్లు, బ్రిడ్జీలు, సొరంగ మార్గాల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఈ సమావేశంలో సూచించారు. సుమారు రూ.20వేల కోట్ల ప్రాజెక్టులు వీలైనంత తొందరగా పూర్తిచేయాలని తెలిపారు. ఎల్ఏసీకి సమీప ప్రాంతాలను అనుసంధానించే రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణాలు సాగుతున్నాయి. దుర్బుక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీలను కలిపే రోడ్ల నిర్మాణాలనూ కేంద్రమంత్రి ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు ఈ వ్యూహాత్మకమార్గమూ ఒక కారణమై ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. భారత సరిహద్దు ప్రాంతంలో నిర్మాణాలను బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది.