‘నేను ఎవరితొత్తును కాను.. నా ప్రధాన అజెండా ఉద్యోగుల సమస్యలే’

దిశ, ఏపీ బ్యూరో : ఉద్యోగులు ఎవరికీ ఏ పార్టీకీ తోత్తుగా వ్యవహరించరని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రితోనైనా సత్సంబంధాల‌తోనే నడుస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన ఆదివారం ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఉద్యోగులకు ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఉద్యమంలో భాగంగా ఉద్యోగుల్ని ఉత్తేజ పరచడానికి కొన్ని వ్యాఖ్యలు చేశానని, దాన్ని బూతద్దంలో చూపి ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కొన్ని పత్రికలు […]

Update: 2021-12-06 04:34 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఉద్యోగులు ఎవరికీ ఏ పార్టీకీ తోత్తుగా వ్యవహరించరని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రితోనైనా సత్సంబంధాల‌తోనే నడుస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన ఆదివారం ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఉద్యోగులకు ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఉద్యమంలో భాగంగా ఉద్యోగుల్ని ఉత్తేజ పరచడానికి కొన్ని వ్యాఖ్యలు చేశానని, దాన్ని బూతద్దంలో చూపి ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తున్నాయని, అందువల్లే తమపై తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. మాకు రాజకీయాలు అవసరం లేదని ఉద్యోగుల సమస్యల కోసమే పోరాటం చేస్తున్నట్లు తేల్చి చెప్పారు.

నా వ్యాఖ్య‌ల్లో ఏవిధమైన రాజకీయ కోణం లేదు, నేను ఎవరి తొత్తును కాదన్నారు. మాకు పార్టీలు అంటగట్టొద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరిస్తే మేం ప్రకటించిన కార్యచరణ ప్రకారం ముందుకు వెళ్తాం. ప్రభుత్వ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రిని అడగకపోతే ఇంకేవరిని అడుగుతాం. పార్టీల మధ్య ఏవైనా రాజకీయాలు ఉంటే మీరు మీరు చూసుకోండి. అంతేకానీ దయచేసి మాకు అంటగట్టవద్దని సూచించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 71 డిమాండ్లు ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పుకొచ్చారు. నాలుగేళ్లైనా పీఆర్సీ ఇవ్వలేదన్న ఆయన కనీసం పీఆర్సీ రిపోర్ట్ అయినా ఇవ్వమని అడిగామని దానికి కూడా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రూ.16 వేల కోట్ల ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరామన్నారు. ఆఖరికి మేం దాచుకున్న డబ్బులు సైతం చెల్లింపులు జరపడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే ఉద్యమ కార్యచరణ ప్రకటించామని తెలిపారు. పీఆర్సీ నివేదిక బయటపెడితేనే దానిలోని సమస్యలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారని కానీ, ఉద్యమం మాత్రం ఈనెల 7నుంచి ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News