ఒక్క షాపు.. రూ. 2 కోట్ల ఆఫర్.. వచ్చే ఎన్నికల కోసమే ముందస్తు వ్యూహం..!
దిశ ప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా మద్యం షాపులపై ఈసారి ఆంధ్రా వ్యాపారుల కన్నుపడింది. ఎలాగైనా సరే మెజార్టీ షాపులు దక్కించుకునేందుకు అక్కడి వ్యాపారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పక్క సరిహద్దు ప్రాంతాల్లో భారీగా టెండర్లు దాఖలు చేశారు. డ్రాలో కూడా రాని వారు షాపులను దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. దీనికోసం షాపు దక్కిన వారికి భారీగా గుడ్‌విల్ ఇచ్చి తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. పోటాపోటీ ఉన్న చోట ఒక్క షాపుకి ఏకంగా రూ. […]
దిశ ప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా మద్యం షాపులపై ఈసారి ఆంధ్రా వ్యాపారుల కన్నుపడింది. ఎలాగైనా సరే మెజార్టీ షాపులు దక్కించుకునేందుకు అక్కడి వ్యాపారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పక్క సరిహద్దు ప్రాంతాల్లో భారీగా టెండర్లు దాఖలు చేశారు. డ్రాలో కూడా రాని వారు షాపులను దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. దీనికోసం షాపు దక్కిన వారికి భారీగా గుడ్‌విల్ ఇచ్చి తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. పోటాపోటీ ఉన్న చోట ఒక్క షాపుకి ఏకంగా రూ. కోటి 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రెండేళ్ల వరకు షాపు నిర్వహించకుండానే భారీగా డబ్బు వచ్చే అవకాశం వస్తుండడంతో షాపులు దక్కిన వారు కొందరు అమ్మేసుకుంటుంటే.. ఇంకొందరేమో ఏం నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. ఆంధ్రా బార్డర్‌లో జిల్లా ఉండటమే కారణమని, అందుకే అక్కడి మద్యం వ్యాపారులు పూర్తిస్థాయిలో జిల్లాపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వచ్చే రెండేళ్లలోపే రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం కూడా పోటాపోటాగా మద్యం షాపులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థం అవుతోంది.
భారీగా గుడ్‌విల్..
అన్ని జిల్లాల్లో కంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఈసారి భారీగా టెండర్లు దాఖలయ్యాయి. 210 షాపులకు గాను దాదాపు 10 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అయితే, వీటిలో ఎక్కువగా ఆంధ్రా వ్యాపారులతో పాటు రాజకీయ నాయకులు కూడా తమ అనుచరులతో భారీగా టెండర్లు దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. ఒక వేళ డ్రాలో షాపులు రాకుంటే ఏం చేయాలో కూడా ముందే సిద్ధం చేసుకుని వచ్చినట్లుగానే కనిపిస్తోంది. శనివారం డ్రా ప్రక్రియ నడుస్తుండటం, వారు వేసిన షాపులు దక్కకపోవడంతో వచ్చిన వారితో బేరసారాలకు దిగారు. షాపు టర్నోవర్ బట్టి ఏకంగా రూ.1 కోటి 50 లక్షలు నుంచి రూ. 2 కోట్ల వరకు ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. భారీగా దాఖలు చేసి ఒక్కషాపు కూడా రాని వారు రూ. 2 కోట్ల వరకు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధపడుతుండటం గమనార్హం. ఆంధ్రాకు చెందిన మద్యం వ్యాపారులు తమకు కావాల్సిన షాపు ఎవరికి వచ్చిందనే వివరాలు సేకరిస్తూ భారీగా బేరసారలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలున్నందునే..
ముఖ్యంగా ఆంధ్రాకు చెందిన మద్యం వ్యాపారులతో పాటు, బడాబాబులు, అక్కడి రాజకీయ నాయకులు తమ అనుచరులతో షాపులు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టెండర్లు ప్రక్రియ మొదలు ఆంధ్రా నుంచి కొంతమంది వ్యక్తులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిష్టవేసినట్లు తెలుస్తోంది. డ్రా రోజైన శనివారం ఎక్సైజ్ కార్యాలయాలు, డ్రా తీసే కేంద్రాల ప్రాంగణాల్లో వారి హవానే కనిపించింది. అయితే, వచ్చే రెండేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నందున షాపులకు పోటీ పెరిగిందని, అదీ కాక ఆంధ్రాలో సరైన బ్రాండ్లు దొరకకపోవడం, జగన్ సర్కార్ మద్యాన్ని ప్రోత్సహించకపోవడం వల్ల కూడా ఆంధ్రా వ్యాపారులు మన దగ్గర పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనే వారికి అన్నివిధాలుగా ఉపయోగపడుతుందని, జిల్లా నుంచి ఆంధ్రా ప్రాంతానికి మద్యం అక్రమ రవాణా కూడా సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో భారీ ఎత్తున కొనుగోళ్లకు సిద్ధపడుతుండొచ్చని మద్యం బిజినెస్‌లో ఆరితేరిన ఓ వ్యాపారి చెబుతున్నమాట.
తెలంగాణ వర్సెస్ ఆంధ్రా వ్యాపారులు..
వాస్తవానికి ఎప్పుడు మద్యం టెండర్లు వేసినా ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ, ఈసారి రాష్ట్రానికి చెందిన బడా వ్యాపారులతో పాటు ఆంధ్రా వ్యాపారుల దృష్టి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడింది. కారణం పక్కనున్న ఆంధ్రా సర్కార్ అక్కడ మద్యాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే. అందుకే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అధికంగా టెండర్లు దాఖలయ్యాయి. వచ్చిన టెండర్లలో సగం వరకు ఆంధ్రావారివే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు షాపులు రాని వారు కూడా తెలంగాణ వ్యాపారులతో నువ్వానేనా అన్నట్లు గుడ్ విల్ ఇచ్చి షాపులు దక్కించుకుంటున్నారు.
కొత్తవారు సతమతం..
కొత్తగా టెండరు వేసి డ్రాలో షాపు దక్కిన వారు సతమతమవుతున్నారు. వచ్చే ఆఫర్లను స్వీకరించాలా లేక సొంతంగా షాపు నడిపించుకోవాలా? అనే సందిగ్ధంలో పడిపోతున్నారు. కొంతమంది కొత్తవారు భారీగా డబ్బు ఒకేసారి రానుండటంతో అడిగిన వారికి ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కొంతమంది మాత్రం మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరిక్షీంచుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే, వ్యాపారుల నుంచి షాపు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొత్తగా టెండరు వేసి షాపు దక్కించున్న ఓ వ్యక్తి చెప్పడం గమనార్హం.
ఆ షాపులకు యమ డిమాండ్..
ఆంధ్రా మద్యం వ్యాపారులు కొన్ని ఏరియాల్లో ఉన్న షాపులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉన్న మండలాలతో హైవేలకు దగ్గరగా ఉన్న దుకాణాలపై ఇంట్రెస్ట్ చూపినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడి నుంచి ఆంధ్రా ప్రాంతానికి సులభంగా రవాణా మార్గాలున్నా.. ఎప్పుడైనా అక్కడి నుంచి సరుకు రవాణా చేయొచ్చనుకున్న ఏరియాలను ఎంచుకున్నట్లు సమాచారం. ఇక మన వ్యాపారులు మాత్రం ఎక్కువగా బెల్ట్ షాపులున్న ఏరియాలోని దుఖాణాలపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం.
వ్యాపారులు సిండికేట్..
ఇప్పటికే చాలా మంది మద్యం వ్యాపారులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. ఎవరికి వారు సొంతంగా వేయడంతో పాటు కామన్‌గా అందరూ కలిపి కూడా టెండర్లు వేశారు. అయితే, ఎవరికి ఏ షాపు వచ్చినా అందరూ పార్ట్నర్స్‌గా ఉండాలనే నిర్ణయానికి ముందే వచ్చి ఒప్పంద పత్రాలు కూడా రాయించుకున్నట్టు సమాచారం. మొత్తంగా దాదాపు చాలామంది మద్యం వ్యాపారులు షాపుల నిర్వహణకు ముందే సిండికేట్ అయినట్లు తెలుస్తోంది.