Kadapa: ఈస్టర్ పండగ రోజు విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

వైయస్సార్ జిల్లా వేంపల్లె మండలం అలవలపాడులో ఈస్టర్ పండుగ రోజు విషాదం చోటు చేసుకొంది. ...

Update: 2023-04-09 12:55 GMT

దిశ, కడప ప్రతినిధి: వైయస్సార్ జిల్లా వేంపల్లె మండలం అలవలపాడులో ఈస్టర్ పండుగ రోజు విషాదం చోటు చేసుకొంది. ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో అక్కా, తమ్ముడు ఉన్నారు. అలవలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన శశికళ ఇంటికి ఈస్టర్ పండుగ పురస్కరించుకొని ఆదివారం బంధువులు వెళ్లారు. అయితే వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య (25), అలవలపాడుకు చెందిన తుమ్మలూరు సాయి సుశాంత్ (11), తుమ్మలూరుసాయి తేజశ్రీ (12) మేనమామ శశికుమార్‌తో కలసి సరదగా గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో చిన్న పిల్లలు లోతుగా ఉన్న కాలువలో మునిగి పోయారు. వీరిద్దరిని కాపాడేందుకు జ్ఞానయ్య, శశికుమార్ కాలువలో గాలించారు. ఈ నేపథ్యంలో జానయ్య సైతం నీటిలో మునిగి పోయారు. శశికుమార్ మాత్రం కొద్దిసేపు వెతికి, భయపడి కాలువపైకి వచ్చి కేకలు వేశారు. స్థానికులు గమనించి అక్కడికి చేరుకుని ముగ్గురిని బయటకు తీశారు. అప్పటికే సాయి సుశాంత్, సాయి తేజశ్రీ, జానయ్య ఊపిరాడక మృతి చెందారు. మృతుల్లో సాయితేజ, సాయి సుశాంత్ అక్కా తమ్ముళ్లుగా గుర్తించారు.

విషయం తెలుసుకున్న వేంపల్లె ఎస్.ఐ తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు వేంపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సాయి సుశాంత్, సాయి తేజశ్రీ తల్లిదండ్రులు రూతు, సురేష్‌లు చక్రాయపేట మండలం చిలేకాంపల్లిలో నివాసం ఉండే వారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తల్లి రూతు మృతి చెందారు. తండ్రి సురేష్ బతుకు దెరువు కోసం ఎర్రగుంట్లలో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దీంతో ఇరువురు చిన్నారులు అలవలపాడులో ఉన్న అమ్మమ్మ శశికళ దగ్గర ఉన్నారు. అమ్మమ్మ చిన్న పిల్లలిద్దరిని వేంపల్లె నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివిస్తున్నారు. అలాగే జానయ్య పులివెందులలో బైక్ మెకానికల్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకు ఆరు నెలల క్రితమే వివాహమైంది. ఈస్టర్ పండుగరోజు ఈ విషాదం గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది. 

Tags:    

Similar News