Varadaraja Swami Temple: భూముల వేలంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

వైయస్సార్ జిల్లా ముద్దనూరు మండలం పెద్ద దుద్యాల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది...

Update: 2023-06-22 15:21 GMT

దిశ,కడప: వైయస్సార్ జిల్లా ముద్దనూరు మండలం పెద్ద దుద్యాల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వరదరాజస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములకు అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించారు. ముద్దనూరు, తొండూరు, సింహాద్రిపురం, ప్రొద్దుటూరు మండలాల్లో ఉన్న 172 ఎకరాల భూములను మూడేళ్లు కౌలుకు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. వందేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను వేలం వేయవద్దని అభ్యంతరం తెలిపారు.

ఒక వర్గం వేలం నిర్వహించాలని, మరో వర్గం వేలం నిర్వహించకూడదని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వేలాన్ని అడ్డుకునేందుకు ఓ యువకుడు పెట్రోల్ తాగి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఎదుటే ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. టీడీపీకి మద్దతు తెలిపినందుకు కక్ష్య సాధింపుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతో వేలం నిర్వహిస్తున్నారని గ్రామస్థులు ఆరోపణలు చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య వేలం పాట కొనసాగించారు.

Tags:    

Similar News