అతి తక్కువ ధరకే మటన్.. ఎగబడ్డ జనం...!
కడప జిల్లా మైదుకూరులో మటన్ తక్కువ రేటుకే అమ్మడంతో మాసంప్రియుడు ఎగబడ్డారు..
దిశ, వెబ్ డెస్క్: కాస్త తక్కువగా వస్తుంటే చాలు కిలో మీటర్ దూరమైనా సరే వెళ్లి తమకు కావాల్సినవి తెచ్చుకుంటారు జనం. అది ఆదివారం మటన్ అతి తక్కవ ధరకు వస్తుందని ప్రకటించడంతో ఇంకేముంది ఎగబడ్డారు. మటన్‌తో పాటు చాక్లెట్లు, మసాలా ప్యాకెట్స్ బోనస్ అని చెప్పడంతో గంటల తరబడి బారులు తీరి మరీ కొనుగోలు చేశారు. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరులో జరిగింది.
ఈ రోజు ఆదివారం కావడంతో శనివారం ఓ వ్యాపారి మటన్ తక్కువ ధరకు ఇస్తున్నట్లు షాపు ముందు బోర్డు పెట్టారు. దీన్ని చూసిన మరో వ్యాపారి పోటీ పడ్డారు. అవతల వ్యాపారి కేజీ మటన్ ఎంతకిస్తాడో అందులో ఒక రూపాయి తగ్గించి అమ్ముతానని ప్రచారం చేశాడు. దీంతో ఇద్దరు వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. కిలో మటన్ రూ. 800 పలుకుతుండగా ఓ వ్యాపారీ రూ. 498కే కేజీ మటన్ ఇస్తానని ప్రకటించారు. దీంతో రెండో వ్యాపారీ రూ. 497కే తాను అమ్ముతున్నానని కొనుగోలు దారులను ఆకర్షించారు. ఈ విషయం మైదుకూరుతో పాటు పక్క గ్రామాలకు తెలియడంతో జనం ఎగబడ్డారు. భారీగా తరలివచ్చి రెండు షాపుల ముందు బారులు తీరారు. దీంతో రెండు షాపుల ఎదుట భారీ క్యూ లైన్ ఏర్పడింది.
ఇలా ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకూ మైదుకూరులోని ఈ రెండు దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. జనం కిలో మటన్ కొనుగోలు చేసి ఇద్దరి దగ్గర చాక్లెట్లు, మసాలా ప్యాకెట్లు తీసుకెళ్లారు. అయితే ఉదయం 9 తర్వాత వచ్చిన మాంసం ప్రియులకు మాత్రం నిరాశ మిగిలిందే. అప్పటికే మటన్ అయిపోవడంతో ఇద్దరు వ్యాపారులు షాపులు మూసేశారు. అయితే ఈ పందెంలో మరి లాభమొచ్చిందో.. నష్టమొచ్చిందో తెలియాల్సి ఉంది. వచ్చే వారం కూడా ఇదే పందెం, రేటు నడస్తుందా అని జనం అంటున్నారు. వచ్చే ఆదివారం ఏం చేస్తారో చూడాలి మరి.