Kadapa: గోపవరంలో ఉద్రిక్త పరిస్థితులు.. భారీగా పోలీసుల మోహరింపు
కడప జిల్లా గోపవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.....

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా గోపవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. గురువారం ఎన్నిక సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్ల దాడికి దిగారు. దీంతో శుక్రవారానికి ఎన్నిక వాయిదా వేశారు. అయితే శుక్రవారం కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ నిర్వహించిన కొద్ది సేపటికే టీడీపీ, వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే ఈ పరిణామంతో ఎన్నికల అధికారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తలించారు. ఈ మేరకు ఎన్నికను మరోసారి వాయిదా వేశారు.
మరోవైపు పోలీసులు అప్రమత్తమయ్యారు. గోపవరంలో భారీగా మోహరించారు. పరిస్థితులను సర్దుమణిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్లలతో కదలికలను గమనిస్తున్నారు. కాగా గోపవరంలో 20 సర్పంచ్ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 19, టీడీపీ ఒక స్థానం గెలుచుకున్నాయి. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆరుగురు వైసీపీ సర్పంచ్‌లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అయితే టీడీపీ, వైసీపీ వర్గీయులు దాడులతో గోపవరం అట్టుడికిపోతోంది.