వివేకా ‘హత్య’ సినిమా దుమారం.. రాచమల్లుకు సునీల్ యాదవ్ సంచలన సవాల్

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శిప్రసాద్ రెడ్డిపై వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

Update: 2025-03-29 10:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(Former Proddatur MLA Rachamallu Sivaprasad Reddy)పై వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case) నిందితుడు సునీల్ కుమార్ యాదవ్(Sunil Kumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై రాచమల్లు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి పలు ప్రశ్నలు సంధించారు. రూ.500 లేక అప్పు చేసిన తాను కోట్లు సంపాదించానని రాచమల్లు ఆరోపణలు చేశారని, అవి ఎక్కడున్నాయో నిరూపించాలని సునీల్ యాదవ్ సవాల్ విసిరారు. ప్రొద్దుటూరులో బీసీ నేతను ఎవరు చంపించారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాచమల్లు ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘హత్య’ సినిమాపై ఫిర్యాదు చేస్తే రాచమల్లు ఎందుకు భూజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఆ సినిమాలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ పాత్రలను ఎందుకు చూపించలేదని నిలదీశారు. తనకేమైనా అయితే అందుకు వైసీపీ నేతలు, వివేకా హత్య కేసు నిందితులే కారణమని సునీల్ కుమార్ యాదవ్ వ్యా్ఖ్యానించారు.

కాగా 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే వివేకా మృతిపై ‘‘హత్య’’ పేరుతో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రిమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలోని పాత్రలు.. తనను, తన తల్లిని పోలి ఉన్నాయంటూ పోలీసులకు సునీల్ ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ రెండో నిందితుడిగా ఉన్నారు. అయితే సునీల్ కుమార్ ఫిర్యాదుతో ‘హత్య’ సినిమా నిర్మాత సహా ఐదుగురిపై కేసు నమోదు అయింది. పవన్ వైసీపీ కార్యకర్త కుమార్ రెడ్డిని పోలీసులు విచారించారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హత్య’ సినిమాపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. వివేకను తాము దారుణంగా నరికి చంపామని నేరాన్ని అంగీకరించిన దస్తగిరి, సునీల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమేంటని మండిపడ్డారు. వివేకా హత్యకు ముందు దస్తగిరి, సునీల్ కుమార్ రూ. 500 కోసం చేయి చాపి అడుక్కునేవారని, అలాంటిది ఇప్పుడు కోట్లకు పడగలెత్తి జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు వారికి ఆ డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై సునీల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన వద్ద కోట్లు ఉన్నట్లు నిరూపించాలని రాచమల్లుకు సవాల్ విసిరారు. 

Tags:    

Similar News